తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో విషాదకర ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) అనే వ్యక్తి తిరువణ్ణామలై మోక్ష మార్గంలో (ఇడుక్కు పిల్లయ్యార్ గుహ) చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిసివేశాయి. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన మణికుమార్ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడంతో రాజమహేంద్రవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మణికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరువణ్ణామలై వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం గిరి ప్రదక్షిణ చేస్తూ.. ఇడుక్కు పిళ్లైయార్ గుహను సందర్శించేందుకు వెళ్లాడు. రాత్రి పదకొండు గంటల సమయంలో మోక్ష మార్గంలో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. లావు కారణంగా అతడు ఇరుక్కుని.. బయటకు రాలేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు.
మోక్ష మార్గంలో చిక్కుకున్న మణికుమార్ను అక్కడ నుండి బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు అతడిని బయటకు తీసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరువణ్ణామలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మణికుమార్ కుటుంబానికి అప్పగించారు.

