అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం పట్టింది. అరంగేట్రం చేసిన నాలుగేళ్లకు ‘సత్యం’ సినిమాతో తొలి విజయం అందుకుంది. కానీ తర్వాత ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. ఇలా ఒక హిట్టు కొట్టడం, తర్వాత వెనుకబడడం.. చాలా గ్యాప్ తర్వాత ఇంకో సక్సెస్ సాధించడం, మళ్లీ కెరీర్లో జోరు తగ్గడం.. ఇలా ఎన్నోసార్లు జరిగింది.
‘మళ్ళీ రావా’తో ఒక టైంలో మంచి బ్రేక్ అందుకున్నాడు.. మళ్లీ తడబడ్డాడు. ఈ మధ్య ‘అనగనగా’ అనే ఓటీటీ చిత్రంతో మెప్పించిన సుమంత్.. ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు సుమంత్ నుంచి ‘న్యూటన్స్ థర్డ్ లా’ అనే సినిమా రాబోతోంది. జగపతిబాబు ఇంకో ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా నేరుగా ట్రైలర్‌తో పలకరించింది.
ప్రతి చర్యకూ సమానమైన ప్రతి చర్య ఉంటుంది అన్నది న్యూటన్స్ థర్డ్ లా. దీని నేపథ్యంలో రాజేష్ కర్ణ అనే కొత్త దర్శకుడు ఈ రూపొందించాడు. టైటిల్‌కు తగ్గట్లే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రేసీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. సుమంత్, జగపతిబాబు పాత్రలన్నీ క్యూరియాసిటీ రేకెత్తించేలా ఉన్నాయి. ట్రైలర్ కట్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఏదో మర్మం ఉంటుందని.. స్క్రీన్ ప్లే ప్రధానంగా థ్రిల్లింగ్‌గా రూపొందిందని అనిపిస్తోంది. కాకపోతే ఈ సినిమా కాస్త ముందు నుంచే టీం ప్రమోట్ చేయాల్సి ఉంది.
మంచి కాన్సెప్ట్‌తో, క్వాలిటీతో సినిమా తీసినట్లున్నారు కానీ.. ఈ పేరుతో ఒక సినిమా తెరకెక్కినట్లే జనాలకు ఇప్పటిదాకా తెలియదు. ఈ మధ్యే సినిమా అనౌన్స్ చేశారు. జులై 31నే సినిమా విడుదల చేయబోతూ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు. సుమంత్ మార్కెట్ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో ముందే ఈ సినిమా విశేషాలను పంచుకుని.. ఒకట్రెండు టీజర్లు వదిలి, జనాల్లో ఆసక్తి రేకెత్తించాక విడుదల ముంగిట ట్రైలర్ వదలాల్సి ఉంది. ఇప్పుడే సినిమా పరిచయం చేసి సడెన్‌గా రిలీజ్ అంటే జనాలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

