ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కష్టాల్లో ఉంటే ఆదుకునే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. కాగా, తాజాగా చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేశ్ కుటుంబానికి చిరంజీవి అండగా నిలిచారు. రమేశ్ ‘గబ్బర్‌సింగ్’తో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.
అయితే ఇటీవలే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరు అపోలో ఆసుపత్రి డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడి రమేశ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో అతడి భార్యకు రూ.3 లక్షల చెక్కును అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు హామీ ఇచ్చారు. ఇక చిరంజీవి సోదరుడు నాగబాబు తన వంతు సాయంగా రమేశ్ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందించారు. రమేశ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

