చిరంజీవి: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది. ఎమోషనల్ అండ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయంతో మెగా కుటుంబంలో ప్రస్తుతం పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ గారి నుంచి కాంప్లిమెంట్స్ గురించి దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ఎమోషనల్ అవుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అవ్వగానే.. మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ బుచ్చిబాబును ఆశ్చర్యంలో ముంచెత్తిందట. ప్రస్తుతం పొలాచిలో షూటింగ్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా టాక్ వినగానే బుచ్చిబాబుకు కాల్ చేశారట. ఆయన లైన్లోకి రాగానే ఎంతో పరవశంతో, ఆనందంతో ‘బుచ్చిబాబు.. బుచ్చిబాబు.. బుచ్చిబాబు..’ అంటూ దాదాపు 8 నుంచి 9 సార్లు బుచ్చిబాబు పేరు పదే పదే కలవరించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. “అబ్బా.. అబ్బా.. ఏం సినిమా తీశావ్ బుచ్చిబాబు! ఏం ఫిలిం ఇది! గాడ్ బ్లెస్ యు.. నువ్వు చాలా మంచి రేంజ్‌కి, నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తావు” అంటూ చిరంజీవి గారు కురిపించిన ప్రశంసల జల్లు తనకెంతో బూస్టింగ్ ఇచ్చిందని బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేశారు.
చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ అమ్మ సురేఖ గారు, చరణ్ సిస్టర్స్ అందరూ ఫోన్ చేసి సినిమా అద్భుతంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారని చెప్పారు. ముఖ్యంగా థియేటర్లలో ఆడియన్స్ రియాక్షన్ గురించి బుచ్చిబాబు చెప్తూ.. “నేను స్వయంగా రెండు మూడు థియేటర్లకు చూశాను. స్క్రీన్ కింద నుండి ప్రేక్షకులను చూస్తున్నాను.. సినిమా చివర్లో ఎమోషన్‌కు కనెక్ట్ అయి థియేటర్లలో 75 శాతం మంది ఆడపిల్లలు, లేడీస్ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. మేము పడ్డ కష్టానికి ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి దక్కిన బెస్ట్ అప్రిసియేషన్ ఇదే” అని అన్నారు.

