తెలంగాణ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి కలకలం రేగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో తనను సంప్రదించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకం విషయంలో స్థానిక ఎమ్మెల్యేలను ప్రభుత్వం సంప్రదించలేదని, ఇది ఏకపక్ష నిర్ణయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎవరి ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే తాము ఎమ్మెల్యేగా ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇలా అయితే తాము అధినాయకత్వానికి ఫిర్యాదు ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరిక.
మునుగోడు నియోజకవర్గ యాదాద్రి జిల్లా పరిధిలోనే, ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంలో తమకు కనీస సమాచారం ఇవ్వలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, బహిరంగ సభకు ఆయన దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ఒరిజినల్‌ను కాదని, కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇలా చేసుకుంటూ వెళితే ఇక పాతవారు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం మాత్రం తిరుమల తరహాలోయాదాద్రిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో అన్ని ప్రాంతాల వారికీ బోర్టులో అవకాశం కల్పిస్తామని చెబుతోంది.
మరొకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసు మర్చిపోయిందని ఆయన చెప్పారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలసి వచ్చారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని, ఇలా అయితే పార్టీలో కొనసాగడం తమ వంటి నేతలకు కష్టమవుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే హైకమాండ్ ఇప్పటికైనా తన విషయంలో నిర్ణయం తీసుకుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాలకు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మద్దతు పలికారు.

