తెలంగాణ పాఠశాలలు పునఃప్రారంభం : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం (జూన్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు జూన్ 12తో ముగియాల్సి ఉండగా, రాష్ట్రంలో తీవ్ర ఎండల కారణంగా ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో విద్యార్థులు దాదాపు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ బడిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఈసారి పాఠశాలల ప్రారంభానికి ముందు ఒక ఆసక్తికరమైన చర్చ తల్లిదండ్రుల మధ్య జరుగుతోంది. జూన్ 15న అమావాస్య రావడం, మరుసటి రోజు మంగళవారం కావడంతో కొందరు పేరెంట్స్ పిల్లలను మొదటి రెండు రోజులు స్కూల్కు పంపాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదని కొందరు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే సాంప్రదాయాలను ఎక్కువగా పాటించే కుటుంబాల్లో ఈ అభిప్రాయం ఎక్కువగా ఉంది. స్కూల్ మొదటి రోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఒక రోజు ఆగితే మంచిది, మంగళవారం కూడా కొత్త కార్యక్రమాలకు అంత అనుకూలం కాదు కొందరు తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు పాఠశాల విద్యార్థులను బుధవారం (జూన్ 17) నుంచి పంపాలని కుటుంబాలు నిర్ణయించుకుంటున్నట్లు గుర్తించారు. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం పాఠశాలలు అధికారికంగా సోమవారం నుంచే ప్రారంభమవుతున్నాయని, మొదటి రోజు నుంచే హాజరు కావాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
విద్యా నిపుణులు కూడా ఇలాంటి సందర్భాల్లో మూఢనమ్మకాల విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన రోజుల్లోనే పాఠ్యాంశాల ప్రణాళిక, పుస్తకాల పంపిణీ, తరగతుల కేటాయింపు వంటి కార్యక్రమాలు జరుగుతాయి, వీటిని విద్యార్థులు మిస్ కాకుండా చూడాలని చెప్పారు.
ఇక చాలా మంది తల్లిదండ్రులు మాత్రం అమావాస్య, మంగళవారం వంటి అంశాలను పెద్దగా పట్టించుకోకుండా పిల్లలను మొదటి రోజే స్కూల్కు పంపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రేపాటి నుంచి పాఠశాలల్లో సందడి మొదలుకానుండగా, తొలి రెండు రోజుల్లో విద్యార్థుల హాజరు శాతం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

