TG TET 2026 ఫలితాలు: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) జూన్-2026 ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ప్రమాణాలపై సరికొత్త చర్చకు తెరలేపాయి. విద్యాశాఖ విడుదల చేసిన అధికారిక ప్రక్రియ ప్రకారం, ప్రస్తుత విధుల్లో ఈ పరీక్ష రాసిన ప్రభుత్వ ఉపాధ్యాయులలో అత్యధికులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,623 మంది ఇన్సర్వీస్ (ప్రభుత్వ, కేజీబీవీ కాంట్రాక్టు) ఉపాధ్యాయులు హాజరుకాగా.. వారిలో కేవలం 8,809 మంది మాత్రమే అర్హత సాధించారు. మిగిలిన 14,814 మంది ఉపాధ్యాయులు ఫెయిల్ అయ్యారు. అంటే ప్రస్తుతం పిల్లలకు పాఠాలు చెప్తున్న టీచర్ల ఉత్తీర్ణత శాతం కేవలం 37.29% గానే నమోదైంది. మరోవైపు, ఇదే పరీక్ష రాసిన నిరుద్యోగ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 45.66% ఉంది. అంటే నిరుద్యోగులతో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల ఉత్తీర్ణత 8.37% తక్కువగా ఉంది. గత టెట్ పరీక్షతో పోల్చినా ఈసారి ఫలితాలు బాగా క్షీణించాయి. గతంలో 65,605 మంది ఇన్-సర్వీస్ టీచర్లు పరీక్ష రాయగా 57.76% (37,893 మంది) పాసయ్యారు. కానీ ఈసారి ఆ స్థాయి ఫలితాలు నమోదు కాలేదు.
సుప్రీంకోర్టు నేపథ్యంలో పెరిగిన ఉత్కంఠ:
ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతున్న టీచర్లు తమ కొలువులు కాపాడుకోవాలంటే రాబోయే రెండేళ్లలో (ఆగస్టు 2028 లోపు) కచ్చితంగా పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధన కారణంగానే టీచర్లు ఈ పరీక్ష రాయాల్సి వచ్చింది. అయితే, ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన ఉపాధ్యాయుల కోసం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మరో అవకాశం కల్పిస్తూ.. ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ప్రత్యేక టెట్ (స్పెషల్ టెట్) పరీక్ష నిర్వహించబడింది. జూలై 21న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల.

