తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో వీధులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. అలిపిరి టోల్ గేట్ నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. వాహనాల తనిఖీకి ఎక్కువ సమయం పడుతుంది. ఘాట్ రోడ్డులో ప్రయాణం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, నిదానంగా కొండమీదకు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. తిరుమలలో వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. తిరుపతిలోనే రూములు తీసుకుని కొండమీదకు రావాలని కోరుతున్నారు.
సహజంగా బుధవారం పెద్దగా రద్దీ ఉండదు. శుక్రవారం నుంచి సోమవారం వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఎలాంటి సెలవులు లేకపోయినా, వీకెండ్ కాకపోయినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇప్పటికీ వేసవి రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా ప్లాన్ చేసుకుని రాకపోతే ఇబ్బందులు పడతారని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అన్నింటికీ ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు.
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ బయట శిలాతోరణం వరకూ ఉన్నందున దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,706 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 34,838 మంది తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.86 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిన్న 4.04 లక్షల శ్రీవారి లడ్డూ విక్రయాలు జరిగాయి. నిన్న అన్నప్రసాదాన్ని 2.42 మంది భక్తులు స్వీకరించారు.

