అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే వలస విధానాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమయ్యారు. ఇప్పుడు ఏకంగా మూడోసారి కూడా అధ్యక్ష పదవిపైనే కన్నేశానన్నట్లుగా మాట్లాడి మరో వివాదానికి తెరలేపారు.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. “తొలి టర్మ్‌లో మిలిటరీని బలోపేతం చేశాం. దాన్ని రెండో… కాదు, మూడో టర్మ్‌లో కూడా సమర్థంగా ఉపయోగిస్తాం” అని పేర్కొన్నారు. వెంటనే తేరుకుని “అలా అనకూడదు. అనవసరమైన వివాదం వద్దు” అంటూ తన మాటను సరిదిద్దుకున్నారు.
అయితే ట్రంప్ నోటి నుంచి ‘మూడో టర్మ్’ మాట రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయన నిజంగానే అలాంటి ఆలోచనలో ఉన్నారా అనే చర్చ అమెరికా రాజకీయ వర్గాల్లో మళ్లీ మొదలైంది.
వాస్తవానికి అమెరికా రాజ్యాంగంలో 22వ సవరణ ప్రకారం ఏ వ్యక్తి అయినా రెండు సార్లకు మించి అధ్యక్షుడిగా ఉండే అవకాశం లేదు. దీనిని మార్చాలంటే చాలా క్లిష్టమైన రాజ్యాంగ సవరణ ప్రక్రియ పూర్తి కావాలి. అందుకే ట్రంప్ వ్యాఖ్యలను చాలామంది రాజకీయ స్టంట్‌గానే చూస్తున్నారు.
అయినా రెండుసార్లు అధ్యక్షుడైన తర్వాత కూడా మూడోసారి వైట్ హౌస్‌పై కన్నేయడం చూస్తుంటే.. ట్రంప్ రాజకీయ అత్యాశకు హద్దులే లేవా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

