న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు… అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో ఒక మహిళ దుశ్చర్యకు పాల్పడింది. ఏకంగా న్యాయమూర్తి కుర్చీపైనే చేతబడికి గురైన ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో కలకలం రేపింది. జడ్జి లేని సమయంలో కోర్టులోకి ప్రవేశించిన మహిళ, తెల్ల ఆవులను జడ్జి కుర్చీపై చల్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
65 ఏళ్ల మంజుల అనే మహిళ 1వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి-జేఎంఎఫ్సీ కోర్టులోకి వెళ్లి ఈ చర్యకు పాల్పడ్డారు. ఆమెపై నడుస్తున్న సివిల్ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో తాంత్రిక పూజలు చేసినట్లు అనుమానిస్తున్నారు. కోర్టు సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా మహిళ జడ్జి కుర్చీ వద్ద ఆవాలు చల్లడం స్పష్టంగా కనిపించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఈ సంఘటనతో కోర్టు భద్రత అంశం కూడా చర్చకు వచ్చింది. న్యాయమూర్తి కుర్చీ వరకు ఓ వ్యక్తి చేరుకుని అలాంటి చర్య చేయగలిగారంటే భద్రతా వ్యవస్థలో లోపాలున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. కోర్టు ప్రాంగణాల్లో నిఘా, ప్రవేశ నియంత్రణ మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది.

