Amulya Sri: సినీ రంగంలో హీరోయిన్గా రాణించాలంటే.. ఆషామాషీ కాదు. టాలెంట్ ఒక్కటే సరిపోదు. రంగుల ప్రపంచంలో ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదురవుతాయి. అవన్నీ తట్టుకుని నిలబడగలిగితేనే చివరకు విజయం సొంతమవుతుంది. ఇది తెలియక చాలా మంది.. తెరపై కనిపించాలని గంపెడాశలు పెట్టుకుని మృగాళ్ల చేతిలో చిక్కి జీవితాలు ఆగమాగం చేసుకుంటున్నారు. అలాంటి ఓ యవతి గాథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ యువతి ఎవరు? అసలు ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది?
ఒక్క ఛాన్స్.. ప్లీజ్..నేనోంటో నిరూపిస్తా… ఖడ్గం సినిమాలో ఈ డైలాగ్ గుర్తుంది కదా.. ఆ సినిమాలో హీరోయిన్.. సినిమాలో ఒక్క ఛాన్స్ కోసం పరితపిస్తుంది. పెద్ద హీరోయిన్ కావాలని కలలు కంటుంది. కానీ.. రంగుల ప్రపంచంలో అడుగడుగునా తోడెళ్లు ఉంటాయని తెలుసుకోలేక.. హీరోయిన్ కావాలంటే ఒకే ఒక్క ఆశతో తోడేళ్ల వలకు చిక్కుతుంది. అది రీల్ స్టోరీ.. కానీ సరిగ్గా ఇలాంటివే ఎన్నో.. ఎన్నెన్నో..రియల్ స్టోరీలోనూ జరుగుతున్నాయి. కానీ కొన్ని వెలుగులోకి వస్తున్నాయి.. పోతున్న రంగుల ప్రపంచం మాటున నీలి నీడల్లో కలిసిపోయాయి. అలాంటి ఓ యువతి కన్నీటి గాథ ఇప్పుడు హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. సినీ వినీలాకాశంలో ధృవతారగా కాంతులీనాలని.. ఎన్నెన్నో ఆశలతో హైదరాబాద్కు వచ్చిన ఓ యువతి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. కొందరు మృగాళ్ల చేతిలో పడిన ఆమె.. సినీరంగంలో తారగా మెరవాల్సింది పోయి.. చుక్కల్లోకెక్కి.. ఆకాశంలో తారగా మిగిలిపోయింది.
ఆ యువతి పేరు అమూల్య శ్రీ. చక్కని ఆహారం.. చూడచక్కని అభినయం.. ప్రతిభతో షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. భవిష్యత్తులో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలని వెండితెరపై హీరోయిన్గా రాణించాలని కలలు కన్నది. అందుకోసం కష్టపడుతున్న సమయంలో.. కొందరు కామాంధుల చేతిలో పడి మానసికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటుంది. చివరకు బలవన్మరణానికి జీవితాన్ని ముగించేసింది. కొంత మంది పోకిరీలు.. ఆమె పాలిట తోడేళ్లుగా మారారు. అమూల్య శ్రీకి సంబంధించిన బాత్రూం వీడియోలను రహస్యంగా చిత్రీకరించారు. అనంతరం ఆలను వీడియోలను అడ్డుపెట్టుకుని గత ఆరు నెలలుగా ఆమెను తీవ్రంగా బ్లాక్మెయిల్గా చూపారు. తమ కోరికలను తీర్చాలని, లేదంటే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వేధింపులతో అమూల్య తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేధింపులకు సంబంధించి అమూల్య శ్రీ.. పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో వేచి చూసిన అమూల్య శ్రీ.. చివరకు విసిగి వేసారి.. తీవ్ర మనోవేదనతో తన అమూల్యమైన జీవితాన్ని ముగించింది.
అమూల్య మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఆమె తల్లి కన్నీరుమున్నీరవుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన కుమార్తె మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగి దాదాపు పది రోజులు గడుస్తున్నప్పటికీ ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్య శ్రీ మృతి పట్ల.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే వేగంగా చర్యలు తీసుకుంటున్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ నలుగురు యువకులతో పాటు ఒక యువతి ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఘటన సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.

