విశాలాంధ్ర ధర్మవరం;మండల పరిధిలోని చింతలపల్లి పంచాయతీలో ఉన్న స్వామి మాన్యం (దేవుడి) భూమి వ్యక్తుల పేరుతో ఆన్లైన్లో ఉండటంపై స్థానిక గ్రామస్థులు, నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిధిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో చింతలపల్లి మహేష్ చౌదరి ,గ్రామస్థులతో పాటు ఆర్డీఓ, ఎంఆర్ఓలను కలిసి ఈ విషయమై ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.గ్రామస్థుల కథనం ప్రకారం… చింతలపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 253లో ఆంజనేయ స్వామి మాన్యానికి భూమి ఉంది. అయితే, ఈ భూమిని పట్టణానికి చెందిన చింతా రామలక్ష్మి, గుండా సుబ్బలక్ష్మి అనే వ్యక్తుల పేర్లపై అక్రమంగా రికార్డుల్లో నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.
దేవుడికి చెందిన మాన్యం భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై ఎలా మారుస్తారు? ఆన్లైన్ రికార్డుల్లో ఉన్న వారి పేర్లను తక్షణమే తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామి మాన్యం భూమిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై సమీక్షించారు. అక్రమంగా ఆన్లైన్ అయిన పేర్లను వెంటనే రికార్డుల నుండి తొలగించి, ఆ భూమిని తిరిగి స్వామి మాన్యానికి (దేవాలయానికి) చెందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పూజారి చింతలపల్లి గ్రామస్థులు, పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు.

