రాష్ట్ర వ్యాప్తంగా 42.70 లక్షల మంది తల్లులకు లబ్ధి
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తూ ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఃతల్లికి వందనం పథకం నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42.70 లక్షల మంది అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తోంది. ప్రతి విద్యార్థి తల్లికి రూ.13,000 చొప్పున అందుతున్న ఈ నిధుల జమ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా… నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఆర్థిక సాయాన్ని అందజేయడం వల్ల విద్యార్థుల చదువులకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకావని అన్నారు. పిల్లలే మన అసలైన సంపదని, వారి చదువులే కుటుంబానికి తరగని ఆస్తి అని. గతంలో ఉన్న ఆంక్షలను తొలగించి, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ ఈ పథకం ఫలాలను వాస్తవంగా వర్తింపజేస్తున్నట్లు వివరించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతోందని వివరించారు, పిల్లల కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి తల్లికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

