గడియారం నుదుటి మీద చిన్నముల్లును కలుసుకున్న పెద్దముల్లు అక్కడే ఉండిపోవడానికి వీల్లేదు. కనక దానికి ‘బై’ చెప్పి పక్కకు జరిగింది. అప్పటిదాకా నిద్దర పోతున్న వీధి కుక్కల గ్యాంగ్ లీడర్ కన్ను సగం తెరిచి చూసింది. ఏం కనిపించిందో ఏమో మరి, లేచి వళ్ళు దులుపుకుని అరుపు లంకించుకుంది. లీడర్ అరుస్త నేపథ్య కారణం తెలీకపోయినా అనుసరించిన గ్యాంగులో ఉన్న గ్రామసింహాలు. మనుషులూ ఇంతే కదా! గదిలో మంచం, మంచం మీద పరుపు, దాని మీద కోటేశ్వరావు. ఈ భౌభౌల బృందగానానికి నిద్ర చెడి, తెరిచి తెరవనట్టు కళ్లు తెరిచి మళ్ళీ మూసుకోబోతుంటే మంచం పక్కన నాలుగు కాళ్లూ నేలమీద సరిగ్గా ఆనని కుర్చీ చప్పుడు వినిపించింది. అందులో ఎవరో కూచున్నట్టు అనిపించింది. గది కిటికీలు తెరిచినట్టు కళ్లు పూర్తిగా తెరిచి చూశాడు. నిజమే. నిజంగానే ఎవరో కుర్చీలో కూచుని ఉన్నారు. అర్ధరాత్రి అప్పులోడు వచ్చి, మంచం పక్కన కూర్చోవడం జరిగే పని కాదు కనక, ఆ వచ్చినవాడు దొంగోడే అయి ఉంటాడు అనుకున్నాడు.
తన దగ్గర ఏముంది కనక, తను ఉన్న పరిస్థితి చెప్పుకుంటే కడువెడు కన్నీళ్లు కార్చేసి, జేబులో ఏదో పాతికో ఉంటే ఇచ్చేసి వెళ్తాడు తప్ప ఏమి చెయ్యలేడు అనుకుంటూ లేచి దిండుకు వీపు ఆనించి కూచుంటూ లైటు వేయబోయాడు కోటేశ్వర్రావు. ‘వద్దు బ్రో లైటు వెయ్యకు. నన్ను చూసి జడుసుకోగలవు. నీ గది పై కప్పులో తీసుకుని లోపలికి దిగబడ్డాను కదా వైర్లు తెగిపోయాను. ఒక వేళా రాదు అన్నది’ వేసిన కుర్చీలో కదిలిన ఆకారం. ‘ఎవరునువ్వు? ఎందుకొచ్చావు? దొంగవేనా?’ అన్నాడు కోటేశ్వర్రావు నిండా మునిగాక చలెందుకనుకుంటూ. ‘ప్రశ్నలూ జవాబులూ అన్నీ నీవంతేనా’ అన్నాడు కుర్చీలో ఉన్నవాడు. ‘అర్థరాత్రి టైంలో వచ్చే వాడిని దొంగ అంటారు’ అన్నాడు కోటేశ్వరావు. చీకట్లో కళ్లు చిట్లించి కుర్చీలో ఉన్న వాడి ఆకారాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తూ. ‘నేను దొంగనేం కాదు నీగది చూస్తుంటే పనికి వచ్చేదేమీ కనిపించడం లేదు’ అన్నాడు కుర్చీలోవాడు. ‘దొంగవి కాకపోతే ఎందుకు వచ్చావు. ఎవడైనా నన్ను లేపేయమని, వక్కపొడి పొట్లం ఇచ్చాడా మరి’ అన్నాడు కోటేశ్వరావు, అరచేత్తో ముక్కు గిల్లుకుంటూ.
‘లేపేయడమంటే చంపేయడమనేనా? ఎవడైనా నిన్నెందుకు చంపాలి?’ ‘ఎందుకంటే కారణం అదే ఏదో అవుతుంది. కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద ఏదో ఓ కారణం మీద చంపుకోవడాలు మామూలు కదా. ఈ మధ్య జనాలు ఒకళ్ళనొకళ్లు చంపుకుని తీరిగ్గా కుక్కర్లో ఊడుస్తున్నారు, వాషింగ్ మెషీన్లో ఉతికేస్తున్నారు’ అని కోటేశ్వర్రావు అంటూ వుంటే లైటు వెలిగింది. ‘ఇందాక స్విచ్చు నొక్కినట్టున్నాను. పోయిన కరెంటు వచ్చిందేమో. హమ్మయ్య తీగలేం తెగలేదు’ అనుకుంటూ కుర్చీలో ఉన్న వాడిని పరీక్షగా చూసేడు కోటి. ‘ఎలా కనిపిస్తున్నాను. మీ లోకంలో మనిషిలానే కదా! భయపడకు బ్రో, నేను నీకేం కీడు చెయ్యను. అలాగని మేలు కూడా చెయ్యలేను. మీ కరెన్సీ నా దగ్గర లేదు సాయం చెయ్యడానికి’ అన్న ఆకారం మామూలు మనిషిలాగానే కనపడింది కోటేశ్వర్రావుకి. ‘మా కరెన్సీ లేదంటున్నావు నీది ఈ దేశం కాదా?’ అనడిగాడు. ‘ఈ దేశమూమరో దేశమూ కాదు. ఈ గ్లోబ్ మీద ఉంటే ఏ దేశమూ కాదు. ఈ లోకమే కాదు నాది’.
‘అంటే..’ అని నోరుతెరుచుకు పోయేడు కోటేశ్వర్రావు. ‘అవును నువ్వనుకున్నదే. నేను ఏలియన్నే.’
అంతెత్తు ఎగిరి పైకప్పుకు కొట్టుకుని కిందపడ్డాననిపించింది కోటేశ్వర్రావుకి. వినడమో, సినిమాల్లో చూడటమో తప్ప ఒక ఏలియన్ని తన గదిలో మంచం పక్కన నాలుగు కాళ్లు సరిగ్గా నేలకు అని కుర్చీలో కూచుని ఉండటం చూసిన కోటేశ్వర్రావుకు నయము, భయము, విస్మయము వంటివెన్ని ఉన్నాయో అన్నీ కలిగాయి. నాలుక పై దవడకు అంటుకుపోయి స్వరపేటిక నుంచి శబ్దం బయలుకు రాలేదు. ‘నీ మానసిక స్థితి నాకర్థమైంది సోదరా. మేం వచ్చిన వాహనం లోనుంచి పొరపాటున జారి నీ గది పైకప్పు రేకు నుండి నీ కుర్చీలో పడ్డాను. అంతేకాని ప్రత్యేకంగా నిన్నేదో చెయ్యాలని, నిన్ను దోచెయ్యాలని కాదు’ అన్నాడు ఏలియన్. అప్పుడు పైకి చూశాడు కోటేశ్వర్రావు. నిజమే పైకప్పు ఢమాల్. భయానికి ఈసారి స్వరపేటిక గొంతు చించుకుంది. ‘ఎంతపని చేశావు ఏలియన్. రేపు పొద్దున్న ఇంటి ఓనర్ ఎన్ని తిట్లు తిడతోడో’ అని దాదాపు ఏడ్చినంత పనిచేశాడు కోటి. ‘తిట్లా.. తిట్లంటే’ అని కన్నబొమ్మలు ముడిచాడు ఏలియన్. ‘తిట్లు.. తిట్లంటే తెలియదా, అవి లేకుండా మాకు పూటగడవదు. అసెంబ్లీలూ, పార్లమెంటులూ, పార్టీలూ, ప్రతిపక్షాలూ అన్నీ వాటి మీదే ఉంటాయి.’
‘ఇంట్రెస్టింగ్ మాకు వాటి గురించి అస్సలు తెలీదు.
అయితే చాలా మిస్సవుతున్నారన్న మాట. మా దగ్గర తిట్లు ఎన్ని రకాలో. వాటినే బూతులు అని కూడా అంటాం. ఒరే పొట్టోడా, ఒరే బట్టతలోడా, ఒరే పిప్పళ్లబస్తా ఆకారపు తిట్లూ, ఒరే కుక్కా, పందీ, దున్నపోతా వాటి జంతువులునడ్డం పెట్టుకుని తిట్టే తిట్లూ, ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని తిట్టే తిట్లుకాక, లాగులో తొండలు వదిలేస్తా, ఉత్సాహంగా నాలుక చీరుస్తా, గుడ్లు పీకి చేతిలో పెడతావా. ‘నువ్వు చెప్తుంటే ఈ లోకంలో తెల్సుకోవలసినవి చాలా ఉన్నాయి. మరోసారి వచ్చినప్పుడు చెబుదువుగాని. నాకు టైం అయ్యింది మీ ఇంటి వెనుకకువచ్చి నిలబడింది మా వాహనం. వస్తా.. మళ్లీ కలుస్తా’ అంటూ కుర్చీలోంచి లేచింది ఆ ఆకారం. ఈసారి మనిషిలా లేదంది, పొగల రింగులు తిరుగుతూ పైకప్పు రంధ్రంలోకి ఎగిరిపోయింది. తను చూసింది నిజంగా ఏలియన్నేనా? తనది కలా? నిజమా? అర్ధం కాలేదు కోటేశ్వర్రావుకి.
– చింతపట్ల సుదర్శన్
9299809212

