సెలబ్రెటీలు స్టేజ్‌ల మీద మాట్లాడేటపుడు.. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామో కాస్త స్పృహతో ఉండటం చాలా అవసరం. ఈ సోషల్ మీడియాలో హద్దులు దాటి మాట్లాడితే.. అవి పెద్ద వివాదంగా మారి వారి సినిమాలనే దెబ్బ తీస్తాయి. చిన్న చిన్న కాలను కూడా పట్టుకుని హేట్ క్యాంపైనింగ్స్ ఎలా నడుపుతున్నారో. ఒకసారి మాట తూలక వివరణ ఇచ్చుకున్నా కూడా పెద్దగా ఫలితం ఉండదు.
టాలీవుడ్ యువ దర్శకుడు వెంకటేష్ మహా విషయంలో ఇదే జరుగుతోంది. తన కొత్త చిత్రం ‘రావు బహదూర్’ను సోషల్ మీడియాలో ఒక వర్గం గట్టిగా టార్గెట్ చేస్తోంది. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరేమో తెలుగులో వచ్చిన గొప్ప చిత్రాలలో ఒకటని కొనియాడుతున్నారు. తెలుగులో ఇలాంటి సినిమా రావడం అరుదని.. మన ఆడియన్స్ ఇలాంటి వినూత్న చిత్రాలను తప్పక ఆదరించాలని అంటున్నారు. అదే సమయంలో ఇంకొందరు మాత్రం సినిమా పరమ బోరింగ్ అని.. చిన్న పాయింట్ పట్టుకుని విపరీతంగా సాగదీశారని తిట్టిపోస్తున్నారు.
ఐతే రెండో వర్గంలో కొందరు సినిమా బాగాలేదని ఊరుకోవట్లేదు. వెంకటేష్ మహా పాత కామెంట్లను ఉటంకిస్తూ ఈ సినిమాను టార్గెట్ చేస్తున్నారు. కొన్నేళ్ల ముందు కొందరు యువ దర్శకులతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్లో కమర్షియల్ సినిమాల్లో సన్నివేశాల ఇంటర్వ్యూల గురించి చాలా తేలికగా మాట్లాడాడు మహా. ముఖ్యంగా కేజీఎఫ్, సలార్ చిత్రాలను అతను కించపరిచేలా మాట్లాడాడన్నది ఆరోపణ. ఈ కామెంట్లు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.
ఒక్క సినిమా దర్శకుడు కమర్షియల్ సినిమాల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ఏంటంటూ అతడి తీరును దుయ్యబట్టారు. ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహా కామెంట్ల గురించి వివరణ ఇచ్చాడు. తాను విమర్శించింది కమర్షియల్ సినిమాలను కాదని, అల్ట్రా వయోలెంట్ మూవీస్ గురించి అని అన్నాడు. కానీ తన కామెంట్లు వింటే ఆ అభిప్రాయం కలగదు.
ఆ కామెంట్లను గుర్తు పెట్టుకుని.. ఇప్పుడు ‘రావు బహదూర్’కు లింక్ చేసి విమర్శలు గుప్పిస్తోంది. చిన్న పాయింట్‌ను లాగి లాగి, ఇంత బోరింగ్ సినిమా తీసిన దర్శకుడు.. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలను మాత్రం తప్పుబడతాడని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు మహా తన సినిమాతో ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తాడో.. ఎంతమేర వసూళ్లు రాబడతాడో తేలిపోతుందని అంటున్నారు.

