లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాలలో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం సినిమా వివాదంలో చిక్కుకుని థియేటర్ రిలీజ్ కాక ప్రభుత్వం అడ్డుపడినప్పుడు డిటిహెచ్ ద్వారా నేరుగా ఇంటికే వచ్చేలా చేస్తానని చెప్పడం అప్పట్లో దుమారం రేపింది. డిస్ట్రిబ్యూటర్లు దుమ్మెత్తి పోశారు. కట్ చేస్తే ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్నాయో లెక్క చెప్పడం కష్టం. అలాంటి విజన్ కమల్ స్వంతం.
ఇవాళ సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కమల్ హాసన్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు సినిమాలు తీయడం కేవలం బిజినెస్‌గా మారిపోయిందని, ప్యాషన్ పక్కనపెట్టేసి వంద, రెండు వందల కోట్లు, మూడు వందల కోట్లు అని లెక్కలేసుకుంటూ తీసే దర్శక నిర్మాతలు పెరిగిపోయారని చురకలంటించారు. పుష్పక విమానం కేవలం పదిహేను లక్షలతో తీస్తే ఇప్పటి లెక్కల్లో అది రెండు వందల కోట్లతో సమానమయ్యే కంటెంట్ గా నిలిచిందని గుర్తు చేశారు.
ఆయన అన్నది అక్షరాలా నిజం. ఎలివేషన్ల మత్తులో, ప్యాన్ ఇండియా ఉచ్చులో పడిపోయి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ ఇదే బాట పట్టారు. పాతిక కోట్ల మార్కెట్ లేని హీరో కూడా నాకు వరల్డ్ బిల్డింగ్ కథ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. దర్శకులు సైతం పోటీ పడి మరీ అలాంటివే రాస్తున్నారు. దాంతో తక్కువ బడ్జెట్లో క్వాలిటీ కంటెంట్లు స్టార్ హీరోల నుంచి రావడం లేదు. ఇదే కమల్ స్వాతిముత్యంకు అయిన ఖర్చు ఎంత. వచ్చిన ఆదాయంతో కేవలం పది శాతం ఉంటుంది.
కమల్ చెప్పినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ఏదో మార్పులు వచ్చే అవకాశం లేదు కానీ ఆలోచించడం అయితే అవసరమే. సింగ్ గీతం జూన్ 11 విడుదల. తనకు పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు గారి మీద అభిమానంతో కమల్ ఈ వేడుకకు చిహ్నం . 94 వయసులోనూ సింగీతం గారు చలాకీగా కనిపించడమే కాదు ఎందరికో స్ఫూర్తినిచ్చేలా సింగ్ గీతం తీశారు.

