- ట్రంప్ సంచలన ప్రకటన
- హార్ముజ్ కార్గో ఫీజు రద్దు
- ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలపై ప్రతిపాదించిన 20 శాతం కార్గో ఫీజును వెనక్కి తీసుకున్నారు. దానికి బదులుగా గల్ఫ్ దేశాలతో వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్‌కు సంబంధించిన నౌకలపై పూర్తి దిగ్బంధం అమలులో సంచలన ప్రకటన చేశారు.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి కోసం అమెరికా చేస్తున్న ఖర్చును భర్తీ చేయాలనే ఉద్దేశంతో కార్గోపై 20 శాతం రీయింబర్స్మెంట్ ఫీజు విధించాలని ట్రంప్ గతంలో ప్రతిపాదించారు. అయితే ఈ నిర్ణయం ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమలో ఆందోళనకు దారితీసింది. రవాణా వ్యయాలు, చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టులో మధ్యప్రాచ్య దేశాల నాయకులతో అత్యంత ఫలప్రదమైన చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ”మధ్యప్రాచ్య నాయకత్వంతో జరిగిన విజయవంతమైన చర్చల ఆధారంగా అమెరికా రీయింబర్స్మెంట్ ఫీజును రద్దు చేస్తున్నాను. దాని స్థానంలో గల్ఫ్ దేశాలు అమెరికాలో భారీ పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలు చేస్తున్నారు.” అని ట్రంప్ ప్రకటించారు.
కార్గో ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూనే.. ఇరాన్‌కు చెందిన నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ”హార్ముజ్ జలసంధి అన్ని దేశాల నౌకలకు తెరిచి ఉంటుంది. కానీ ఇరాన్‌కు మాత్రం కాదు.” అని స్పష్టం చేశారు. ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలు, అలాగే ఇరాన్ సరుకును తీసుకెళ్లే ఏ నౌకనైనా పూర్తిగా దిగ్బంధం ప్రకటించింది. అయితే ఈ దిగ్బంధం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం దీన్ని ఎలా అమలు చేస్తారు? అనే ట్రంప్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. వైట్ హౌస్ కూడా అదనపు సమాచారం ఇవ్వలేదు.
ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం కార్గో ఫీజు ఆయన ప్రభుత్వంలోని అనేక సీనియర్ అధికారులు కూడా వ్యతిరేకించినట్లు సమాచారం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంతర్జాతీయ జలమార్గాలపై టోల్ ఫీజులు విధించకూడదని గతంలోనే అభిప్రాయపడ్డారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు కూడా ఇదే వైఖరిని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెనక్కి తీసుకున్నట్లు.
అమెరికాలో భారీ పెట్టుబడులు
గల్ఫ్ దేశాలు అమెరికాలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నాయని.. దీనివల్ల తయారీ రంగం బలోపేతం కావడంతో పాటు లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని ట్రంప్ తెలిపారు. అయితే ఏయే దేశాలతో ఒప్పందాలు కుదిరాయని వెల్లడించలేదు.
ఇరాన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్.. ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాలను సొంతం చేసుకోనివ్వబోమని స్పష్టం చేశారు. ”వందల వేల మందిని చంపే రోజులు ఇరాన్‌కు ముగిశాయి. ముఖ్యంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను పొందదు.” అని ట్రంప్ అన్నారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంటుంది, ఈ ప్రాంతంలో అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఇంధన మార్కెట్లు, పింగ్ సంస్థలు, ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి.


