PM Vidhyalaxmi పథకం కింద దేశంలో గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల విద్యా రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాలు, ల్యాప్టాప్, ఇతర విద్యా అవసరాలకు సంబంధించిన ఖర్చులను ఈ రుణం ద్వారా భరించవచ్చు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాధారణ నిబంధనలతో రుణాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఎవరు అర్హులు?
PM విద్యాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు భారత్లో గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందాలి. కుటుంబ ఆదాయం, విద్యా అర్హతలు, కోర్సు స్వభావం వంటి అంశాలు బ్యాంకులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు పూర్తి చేసిన విద్యార్థులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.10 లక్షల వరకు రుణం
ఈ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు విద్యా రుణం పొందవచ్చు. ఈ మొత్తానికి ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే తృతీయ వ్యక్తి గ్యారంటీ కూడా అవసరం లేదు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు తక్కువ వడ్డీతో రుణం అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
వడ్డీ రాయితీ కూడా
ఆర్థికంగా అత్యంత వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా కల్పిస్తోంది. చదువు పూర్తయ్యే వరకు లేదా మోరటోరియం కాలంలో వడ్డీ సబ్సిడీ లభించే అవకాశం ఉంటుంది. దీనివల్ల విద్య పూర్తయ్యే వరకు రుణ భారం తగ్గుతుంది.
దరఖాస్తు ఎలా చేయాలి?
విద్యార్థులు PM Vidyalaxmi పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు, అడ్మిషన్ సమాచారం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. అనంతరం ఎంపిక చేసిన బ్యాంకు దరఖాస్తును పరిశీలించి రుణపత్రంపై నిర్ణయం తీసుకుంటుంది.
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు 4.48 లక్షల మంది విద్యార్థులకు రూ.18,172 కోట్ల విలువైన రుణాలు PM విద్యాలక్ష్మి పథకం కింద మంజూరయ్యాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ఉన్నత విద్యను కొనసాగిస్తూ తమ లక్ష్యాలను చేరుకుంటున్నారు.

