వయస్సు కేవలం నెంబర్ మాత్రమే అనే పదం ఇప్పుడు చాలా మంది అలా ఈజీగా వాడేస్తున్నారు. పూర్వకాలంలో మనిషి దీర్ఘాయుష్సుతో బతికినా… ప్రస్తుత కాలంలో చిన్న వయసుతోనే జీవితాలను చాలిస్తున్న పరిస్థితి. ఈ తరహా పరిస్థితికి చాలానే కారణాలు ఉన్నా.. అనాది కాలం నాటి జీవన స్థితిగతులను ఇప్పటికీ కొందరు వందేళ్లకు పైబడి బతుకుతున్న వైనం చూస్తున్నదే. ఈ కోవలోనే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. 116 ఏళ్ల వయసు కలిగిన ఓ వృద్ధురాలు… వెంకన్న దర్శనానికి కాలి బాటన సాగుతూ కనిపించారు.
వయసు ఉడిగిన దశలో కనిపిస్తున్న వ్యక్తి వృద్ధురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు గానీ… ఆమె ఓ కన్నడిగురాలని మాత్రం తేలింది. తన మనవలు, మనవరాళ్లతో వెంకన్న దర్శనానికి కలిసి బయలుదేరిన ఆ వృద్ధురాలు… వారితో పాటే కాలి నడకననే తిరుమల కొండకు చేరుకునేందుకు సిద్ధపడింది.
ఆ వృద్ధురాలి కోరికను కాదనలేకపోయిన ఆమె కుటుంబం ఆమెను చేదోడుగా నిలుస్తూ తిరుమల కాలి బాటన ఆమెతో పాటు సాగిపోయింది. నడవడానికే కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్న ఆ వృద్ధురాలు… తిరుమల కాలి బాటలోని మెట్లను మాత్రం అవలీలగా ఎక్కేస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తిరుమల కాలి బాటలో మెట్లు ఏ స్థాయిలో ఉంటాయన్నా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిగిలిన ప్రదేశంలో ఓ మోస్తరు ఎత్తు ఉన్నా..మోకాళ్ల పర్వతంలో మాత్రం మెట్లు అంతెత్తున ఉంటాయి. వాటిని అదిగమించాలంటే కుర్రకారుకు కూడా ఒకింత కష్టమేనని చెప్పాలి. మరి ఈ మెట్లను ఈ వృద్ధురాలు అలవోకగా అధిగమించిన తీరు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కుటుంబ సభ్యులు చేయందించినప్పుడు ఒకింత వణుకుతూ కనిపించిన ఆ వృద్ధురాలు… సొంతంగా మెట్లు ఎక్కే సమయంలో మాత్రం తడబడకుండా సాగుతున్న తీరు అబ్బురపరుస్తోంది. 116 ఏళ్ల వయసులోని తమ అమ్మమ్మ కోరిక మేరకే ఇలా కాలి బాటన సాగుతున్నామని ఆమె మనవడు ఒకరు చెప్పారు. అంత వయసులో అవలీలగా తిరుమల కాలి బాట ఎక్కుతున్న వ్యక్తి వృద్ధురాలి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

