ఒడిస్సీ: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి సినిమా వస్తుందంటేనే సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశన్నంటాయి. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే నోలన్.. ఈసారి దాదాపు 3,000 ఏళ్ల పురాతన గ్రీకు ఇతిహాసం ‘ది ఒడిస్సీ’ని అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిగా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దాదాపు మూడు గంటల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం స్టార్టింగ్ నుంచే ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. విజువల్స్, ఎమోషన్స్, యాక్షన్, మైథాలజీ అంశాల సమ్మేళనంగా రూపొందించిన ఈ సినిమా హాలీవుడ్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రంలో ఒడిస్సియస్ పాత్రలో నటించిన మాట్ డామన్ తన కెరీర్లోనే అత్యుత్తమ నటనను కనబరిచారని సినీ వర్గాల్లో ప్రశంసించారు. యుద్ధ వీరుడిగానే కాకుండా, తప్పులు చేసే సాధారణ మనిషిగా, కుటుంబం కోసం తపించే భర్తగా, తెలివితేటలతో ప్రతి సవాలును ఎదుర్కొనే నాయకుడిగా ఆయన పాత్రను ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు. ట్రోజన్ హార్స్ నుంచి తప్పించుకోవడం, సిర్సే వంటి మాయాజాలాల నుంచి తన సైన్యాన్ని రక్షించడం వంటి సన్నివేశాల్లో ఆయన నటన హైలెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక టామ్ హాలండ్ ఈ మూవీలో టెలిమాకస్ పాత్రలో పూర్తిగా కొత్త కోణంలో కనిపించనున్నారట. స్పైడర్‌మ్యాన్ ఇమేజ్‌కి భిన్నంగా, తండ్రి కోసం ఎదురుచూస్తే యువకుడిగా ఆయన నటన ప్రేక్షకులను కదిలిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా తన తండ్రి గురించి విన్న తర్వాత భావోద్వేగానికి సంబంధించిన ఒక సన్నివేశం ఈ సినిమాకే లైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.
పెనెలోప్ పాత్రలో యాన్ హాతవే తన అద్భుతమైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారని చెబుతున్నారు. భర్త కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తూనే రాజ్యాన్ని ధైర్యవంతురాలైన రాణిగా ఆమె భావోద్వేగాలను ఎంతో సహజంగా పలికించారని అంటున్నారు. మరోవైపు జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ, కనిపించిన ప్రతిసారి తన ప్రత్యేక ఉనికితో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్. రాబర్ట్ ప్యాటిన్సన్ మరోసారి తన నటనతో ప్రత్యేక ముద్ర వేశారట. ప్రతి సన్నివేశంలో ఉత్కంఠను పెంచే పాత్రలో ఆయన ఈ చిత్రంలో కనిపించబోతున్నారట. అలాగే ఇలియట్ పేజ్, లుపిటా న్యోంగో, చార్లీజ్ థెరాన్, జాన్ బెర్న్థాల్, నిఖిల్ పటేల్ వంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పారు. పెద్ద తారాగణం ప్రతి పాత్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంలో నోలన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే ‘ది ఒడిస్సీ’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని.. ఒక విజువల్ గ్రాండియర్, భావోద్వేగ కథనం, అద్భుతమైన నటన, సాంకేతిక నైపుణ్యం కలిసిన అరుదైన సినిమా అనుభవంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. క్రిస్టోఫర్ నోలన్ మరోసారి తన డైరెక్షన్ మ్యాజిక్‌తో ప్రపంచ సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చిత్రీకరించారని చెప్పారు.

