మూగబోయిన మధుర స్వరం
ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూత
మైసూరు: గాన శిఖరం నేలకొరిగింది. ఒక స్వరం మూగబోయింది. మధుర గాయని నింగికెగింది. ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి కన్నుమూశారు. మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ల ఆమె వృద్ధాప్య సమస్యలతో ఆమె కన్నుమూసినట్లు మనమరాలు అప్సర విద్యల ఇన్స్టా వేదికగా ప్రకటించారు. దక్షిణ భారత గానకోకిలుగా పేరుగాంచిన జానకి సుమారు 50 వేలకు పైగా పాటలను పాడారు.
1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో ఎస్.జానకి జన్మించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అద్భుతమైన పాటలను అలపించారు. ఆమె గాన మాధుర్యానికి నాలుగు జాతీయ అవార్డులు సహా, 33 వివిధ సినీ అవార్డులు అందుకున్నారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం… 2013లో పద్మభూషణంతో సత్కరించింది. తొలితరం ఘంటసాల నుంచి మలితరం బాలసుబ్రహ్మణ్యం వరకూ ఎంతో మంది గాయనీ గాయకులతో కలిసి ఎస్.జానకి అద్భుత గీతాలు ఆలపించారు. ఆమె మరణం తెలుగుకే కాదు దక్షిణాది సినీ పరిశ్రమకే తీరని లోటు. ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ప్రియమైన అమ్మమ్మ: మనుమరాలు అప్సర…
‘ప్రియమైన అమ్మమ్మ, దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూశారన్న వార్త తెలియజేయడానికి ఎంతో విచారిస్తున్నా. కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయత మధ్య ప్రశాంతంగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె అద్భుతమైన జీవితాన్ని గడిపారు. తన గానంతో లక్షల మందికి ఆనందింపజేశారు. ఆమె పాటలు మధుర జ్ఞాపకాలు. ఈ దుఃఖ సమయంలో మా కుటుంబం ఏకాంతతను గౌరవించాల్సిందిగా అందరినీ కోరుతున్నా’ అని జానకి మనుమరాలు అప్సర అన్నారు.
సినీ గాన ప్రస్థానం ఇదీ…
1957లో ‘విధియన్ మిలయాట్టు’ అనే తమిళ సినిమా ద్వారా జానకి గాయనిగా సినీ రంగంలో అడుగు పెట్టారు. ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం నుంచి నేటి తరం గాయకులతో కలిసి ఆమె వేలాది సినీ గీతాలు ఆలపించారు. లాలిపాటలు, భక్తిరసగీతాలు, జానపదాలు, యుగళ గీతాలు, శాస్త్రీయ సంగీత ఆధారిత ఎన్నో పాటలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల గొంతులతో పాటల్లో ఆమె మిమిక్రీ చేసి చూపించారు. ‘సిరిమల్లె పువ్వా’ ఆమె వెదజల్లిన సుస్వరాలు ఏనాటికీ పరిమళిస్తేనే ఉంటాయి. పగలే వెన్నెల, గున్న మామిడి కొమ్మమీద, పగలే వెన్నెల, నీలి మేఘాలలో అంటూ ఆమె కురుపించిన స్వరాజల్లో అభిమానులు తడిసి ముద్దయ్యారు.

