మన తెలంగాణ/రాజేంద్రనగర్: అతను శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి. కానీ, సభ్యసమాజం సిగ్గుపడేలా నీచమైన వ్యక్తిత్వాన్ని ఒంట బట్టించుకున్నాడు. తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణికి అక్రమ సంబంధం అంటగడుతూ, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడంతో పాటు ఆమెపై హత్యాయత్నానికి ఒడిగట్టాడు. అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిని శివరాంపల్లి వద్ద గల సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఈ సంఘటన వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల ట్రైనీ ఐపీఎస్ అధికారిణి జూన్ 23నుంచి పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. ఆమెతో పాటు అదే బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లు శిక్షణ పొందుతున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి అనే తోటి ఐపీఎస్ ట్రైనీ బాధితులను కొన్నిరోజులుగా వేధించడం మొదలుపెట్టాడు. తోటి వారిముందు సదరు మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ వచ్చాడు.
ఎటువంటి ఆధారాలు లేకుండా ఆమెకు మరొక శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌తో సంబంధం ఉన్నదని తప్పుడు ఆరోపణలు చేశాడు. అక్రమ సంబంధం ఉందని అంగీకరించేలా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమెను అసభ్య పదాలతో సంబోధించే వాడు. బెదిరింపులకు గురిచేస్తూ బ్లాక్‌మెయిల్‌కు చూపుతూ ఆమె వ్యక్తిగత సందేశాలను తనకు చూపించేలా ఆమెను బలవంతం చేశాడు. బాధితురాలి వ్యక్తిగత వీడియోను రిక్టార్ చేసి ఆమె భర్తకు పంపాడు. ఈ కోవలో ఈ నెల 8న ఆమె సెల్ ఫోన్ లాక్కొని తన గదికి తీసుకెళ్లి పాస్వర్డ్ చెప్పాలంటూ బెదిరించాడు. అంతటితో ఆగని అతను ఈ నెల 9న రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఆమెను అక్రమంగా అడ్డుకొని బలవంతంగా తన గదికి తీసుకువెళ్లాడు. అనంతరం ఆమె జుట్టు పట్టుకుని, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
అలాగే ఆమె మెడపై కత్తి పెట్టి తన గది నుండి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో పాటు ఆమెపై 3 కండోమ్ ప్యాకెట్లను విసిరాడు. 10న ఉదయం సుమారు 7.50 గంటలకు అతను బాధితురాలిపై చేతితో భౌతిక దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు ఆమెను అసభ్యకరంగా తాకాడని ఆమె తన ఫిర్యాదులో ఉంది. ఆమె అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియో రికార్డ్ చేసి, బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో బాధితురాలి భర్తకు పంపాడు. తప్పుడు ఆరోపణలతో అవమానకరమైన వ్యాప్తిచేయడం ద్వారా ఆమె ప్రతిష్ఠాత్మకంగా దెబ్బతీయడానికి ఉదయ్‌కృష్ణారెడ్డి ప్రయత్నించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్లు 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2), ఐటీఏ చట్టం -2008 ప్రకారం సెక్షన్ 66 ఈ, 67 కింద అత్తాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

