- ముంబై విమానాశ్రయంలో ఒకే రన్‌వేపై రెండు విమానాలు
- ATC అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
Mumbai Airport Runway Incident: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి పెను విమాన ప్రమాదం తప్పింది. ఒకే రన్‌వేపై రెండు విమానాలు ఉండటంతో ప్రమాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు, పైలట్ల అప్రమత్తతతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా నిలిచాయి.
ఎలా జరిగింది?
అందిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (AIX1547 – Boeing 737 MAX 8) రాత్రి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ల్యాండింగ్ అనంతరం ఆ విమానం ఇంకా రన్‌వేను పూర్తిగా ఖాళీ చేయలేదు. అదే సమయంలో, ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం (AI816 – బోయింగ్ 77-300) అదే రన్‌వేపై టేకాఫ్ కోసం వేగాన్ని ప్రారంభించింది. దీంతో రెండు విమానాలు ఒకే రన్‌వేపై ఉండటంతో ప్రమాదం ఏర్పడింది.
ATC అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
రెండు విమానాలు ఒకే రన్‌వేపై ఉన్నాయని గుర్తించిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెంటనే స్పందించారు. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న ఎయిర్ ఇండియా విమానం పైలట్‌కు తక్షణమే టేకాఫ్‌ను రద్దు చేయాలని సూచించింది. ఏటీసీ సూచన వెంటనే పైలట్ విమానం వేగాన్ని తగ్గించి, టేకాఫ్‌ను నిలిపివేసి సురక్షితంగా విమానాన్ని పార్కింగ్ బే వైపు మళ్లించాడు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏటీసీ సూచనలు అందిన వెంటనే విమాన సిబ్బంది టేకాఫ్‌ను నిలిపివేశారని, విమానాన్ని సురక్షితంగా తిరిగి ల్యాండింగ్ బేకు తీసుకెళ్లారని తెలిపారు. అలాగే, సంస్థ ప్రామాణిక నిర్వహణ విధానాలు (SOPs) ప్రకారం విమానానికి సాంకేతిక తనిఖీలు జరిగాయి.
ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఈ ఘటనతో ఢిల్లీకి వెళ్లాల్సిన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. బాధితులను త్వరగా గమ్యస్థానానికి తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు సంస్థ.
వందలాది ప్రాణాలు కాపాడిన సమయస్ఫూర్తి
ఏటీసీ అధికారులు, పైలట్ల సమయస్ఫూర్తితో స్పందించి ఉంటే, ఒకే రన్‌వేపై రెండు భారీ విమానాలు ఉండటంతో ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. వారి అప్రమత్తత కారణంగా వందలాది మంది ప్రయాణికులు సురక్షితంగా నిలిచారు.

