ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ… చాన్నాళ్ల పాటు బయటకే రాలేని పరిస్థితి. ఆ స్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఆ పార్టీ బయటకు వస్తోంది. అదే సమయంలో తన టార్గెట్ ఎవరన్నా కూడా ఆ పార్టీ విస్పష్టంగానే చెబుతోంది. తమ అంతిమ టార్గెట్ టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఏపీ మంత్రి నారా లోకేశేనని ఆ పార్టీ నేతలు కూడా బహిరంగంగానే చెబుతున్నారు. సీఎంగా ఉన్న టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడినో, లేదంటే డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ నో ఆ పార్టీ టార్గెట్ చేస్తుందని అందరూ భావించినా అందుకు విరుద్ధంగా వారిద్దరినీ పక్కనపెట్టేసిన… వైసీపీ లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు.
వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు టీడీపీతో జనసేన, బీజేపీల పొత్తు, విపక్షంలోని టీడీపీకి నూతనోత్తేజం నింపేలా లోకేశ్ కీలక అడుగులు వేశారు. యువ గళం పేరుతో లోకేశ్ చేసిన పాదయాత్ర ఏపీ రాజకీయాలను మార్చేసిందని చెప్పాలి. ఏపీలోని అన్ని జిల్లాలను టచ్ చేస్తూ సాగిన యువగళం యాత్రలో లోకేశ్ దాదాపు అన్ని వర్గాలకు దగ్గరయ్యారు. ఆయా వర్గాల సమస్యలను విన్నారు. వాటి పరిష్కారం దిశగా కీలక హామీలు ఇచ్చారు. జనసేన, బీజేపీలను టీడీపీకి దగ్గర చేశారు. వెరసి కూటమి ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టింది. ఈ లెక్కన వైసీపీ లక్ష్యం లోకేశేనన్న విశ్లేషణలు సాగాయి.
అయితే ఓటమిని జీర్ణించుకునేందుకే చాలా సమయం తీసుకున్న వైసీపీ… తాజాగా బరిలోకి దిగిందనే చెప్పాలి. వైసీపీ అధినేత తన మీడియా సమావేశాల్లో, ఇతరత్రా ప్రసంగాల్లో లోకేశ్ కేంద్రంగా పెద్దగా ఆరోపణలు గుప్పించడం లేదు. ఎంతసేపూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మీదనే ఆరోపణలు గుప్పిస్తున్న జగన్… లోకేశ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లా, నియోజకవర్గ స్థాయి వైసీపీ నేతలంతా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను వదిలేసి లోకేశ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ తరహా ధోరణికి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిందే కారణమన్న వాదనలూ లేకపోలేదు.
వైసీపీ అదికారంలో ఉండగా… ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతల మీద వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కుటుంబంపై కేసులు, ఆయనకు భద్రత ఉపసంహరణ వంటి నిర్ణయాలు వరుసగా జరిగాయి. వీటిపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా ప్రకాశ్ రెడ్డి… లోకేశ్‌ను టార్గెట్ చేసుకునే సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇంకా తమ టార్గెట్ నారా లోకేశేనని కూడా ఆయన దగ్గర ఉంచడం. జిల్లా, నియోజవర్గ స్థాయి కూటమి నేతలను తాము పట్టించుకోమని, తాము నేరుగా లోకేశ్ నే లక్ష్యంగా సాగుతామని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు, ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో యువతకు పద్దపీట తదితర నిర్ణయాలతో కూటమి ప్రభుత్వం లోకేశ్ కనుసన్నల్లోనే వైసీపీ నడుస్తోందని మెజారిటీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక లోకేశ్ పాత్ర ఉంది. ఈ విధంగా జగన్ నేరుగా లోకేశ్ ను టార్గెట్ చేస్తే… లోకేశ్ ఎక్కడ మైలేజీ వస్తుందోనన్న భయం వైసీపీని వెంటాడుతోంది. అందుకే జగన్ ఎంతకూ లోకేశ్ ప్రస్తావన తీసుకుని రావడం లేదు. అయితే తన పార్టీ నేతల చేత మాత్రం ఆయన లోకేశ్ ను టార్గెట్ చేస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

