న్యూఢిల్లీ: జాతీయ గీతం వందే మాతరం అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా ఇకపై చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. ఈ మేరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జాతీయ గౌరవ అవమానాల నివారణ (సవరణ) బిల్లు2026ను సోమవారం రాజ్యసభ కార్యాచరణ జాబితాలో చేర్చారు. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ గౌరవ అవమానాల నివారణ చట్టం1971 ప్రకారం జాతీయ జెండా, భారత రాజ్యాంగం, జాతీయ గీతం జనగణమన వంటి జాతీయ చిహ్నాలను అవమానించడం నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్ఠంగా మూడు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
తాజా సవరణ బిల్లు ద్వారా వందే మాతరం కూడా జనగణమనకు ఉన్న చట్టబద్ధమైన రక్షణను కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వందే మాతరం ఆలాపనకు ఎవరైనా అడ్డంకులు కల్పించినా, ఏ రూపంలోనైనా జాతీయ గీతాన్ని అవమానించినా అది శిక్షార్హ నేరంగా పరిగణించబడుతుంది.
వందే మాతరం రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలు జరుగుతున్నాయి, జాతీయ గీతానికి మరింత రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసి, అధికారిక కార్యక్రమాల్లో జనగణమన ఆలపించే ప్రతిచోట వందే మాతరం కూడా తప్పనిసరిగా ఆలపించాలని లేదా వినిపించాలని సూచించింది.

