ఇటీవల: నీట్ 2026 పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వరుస ఆందోళనలతో గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడతాయని తెలిపారు.
జంతర్ మంతర్‌లో వరుస ఆందోళనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జంతర్ మంతర్ ప్రాంతంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
జంతర్ మంతర్ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని భారీగా బలగాలను మోహరించారు. జంతర్ మంతర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుతంగా చేస్తున్న విద్యార్థులను అణగదొక్కేందుకు మోడీ సర్కార్ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు చర్యలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
చలో పార్లమెంట్ హింసాత్మకం:
నీట్ 2026 పేపర్ లీక్, నీట్ అభ్యర్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 20న కాక్రోచ్ జనతా పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్)కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్లమెంట్ మార్చ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేశారు. నిరసనను అణిచివేసేందుకు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో చలో పార్లమెంట్ హింసాత్మకంగా మారింది.
కాంగ్రెస్ మెరుపు ధర్నా:
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పార్లమెంట్ మార్చ్ కార్యక్రమంలో నిరసనకారులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం (జులై 21) ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి యత్నించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే భాగమై ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వ తీరును, పోలీసుల తీరును కాంగ్రెస్ నేతలు ఎండగట్టారు. ప్రధాని మోడీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిరసనలో భాగమైన కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, గొంతెత్తితే బేడీలు వేసి బంధిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.

