ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఇందులో భాగంగా వ్యూహాత్మక ప్రణాళికలను రెడీ చేసుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం చూసింది.. చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) జూన్ నెలలో కూడా తన గోల్డ్ నిల్వలను భారీగా పెంచుకుంది.
చైనా వరుసగా బంగారం కొనుగోళ్లు జరపడం ఇది నిరంతరాయంగా 20వ నెల కావడం విశేషంగా చూడవచ్చు. జూన్ నెలాఖరు నాటికి చైనా అధికారిక బంగారు నిల్వలు 75.44 మిలియన్ల ఫైన్ ట్రాయ్ ఔన్సులకు (దాదాపు 2,346 మెట్రిక్ టన్నులు) చేరుకున్నాయి. అంతకుముందు మే నెలాఖరు నాటికి ఈ నిల్వలు 74.96 మిలియన్ ఔన్సులుగా ఉన్నాయి. అంటే చైనా కేవలం ఒక్క నెలలోనే సుమారు 4,80,000 ఔన్సుల (దాదాపు 15 మెట్రిక్ టన్నులు) గోల్డ్ దాచి పెట్టుకుంది. ప్రస్తుత కొనుగోళ్ల పరంపరలో ఇదే అతిపెద్ద నెలవారీ కొనుగోలు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.
అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం అందరూ గమనించాల్సి ఉంటుంది. చైనా వద్ద ఉన్న బంగారం పరిమాణం పెరిగినప్పటికీ.. వాస్తవంగా దాని మొత్తం నిల్వల విలువ అయితే తగ్గింది. మే చివరి నాటికి చైనా నిల్వల విలువ 340.75 బిలియన్ డాలర్లుగా ఉండగా.. జూన్ చివరి నాటికి అది 303.72 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో జూన్ నెలలో బంగారం ధరలు భారీగా క్షీణించడమేనని చెప్పుకోవచ్చు. జూన్ నెలలో స్పాట్ గోల్డ్ ధరలు దాదాపు 11.65 శాతం మేర పతనమై.. ఒక దశలో 4,000 డాలర్ల మార్కు కంటే కిందకు పడిపోయాయి. మార్కెట్ రేట్ల హెచ్చుతగ్గుల వల్ల కాగితంపై దాని మొత్తం విలువ తక్కువగా ఉన్నప్పటికీ చైనా వద్ద ఉన్న బంగారం నిల్వలు పెరిగాయి.
చైనా నిరంతరాయంగా బంగారాన్ని కొనుగోలు చేయడం వెనుక అనేక బలమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కేవలం స్వల్పకాలిక లాభాల కోసం చూసే ట్రేడర్లలా కాకుండా.. దీర్ఘకాలిక రక్షణ కోసం ఆస్తులను కేటాయించే ఇన్వెస్టర్లలా పనిచేస్తుంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి వంటి సమయాల్లో బంగారం ఎల్లప్పుడూ అత్యంత సురక్షితమైన ఆస్తిగా (సేఫ్ హెవెన్) నిలుస్తుంది. అన్నింటికీ మించి చైనా తన విదేశీ మారక నిల్వలను కేవలం అమెరికా డాలర్లపైనే ఆధారపడకుండా డీ డాలరైజేషన్ (De-Dollarisation) చూస్తోంది. ఏ దేశం లేదా వ్యవస్థ కూడా సులభంగా స్తంభింపజేయలేని.. ఎలాంటి ఆంక్షలకు లొంగని ఏకైక తటస్థ ఆస్తి బంగారం మాత్రమే కావడంతో చైనా దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
ప్రస్తుతం చైనా అధికారిక నిల్వల్లో బంగారం వాటా కేవలం 10 శాతం కంటే తక్కువగానే ఉంది. అదే అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో ఇది దాదాపు 70 శాతంగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి, ముఖ్యంగా ధరలు తగ్గిన సమయాన్ని ఆసరాగా చేసుకుని చైనా తన కొనుగోళ్ల వేగాన్ని మరింతగా పెంచుకుంటూ పోతోంది.
రాబోయే రోజుల్లో కూడా చైనా ఇదే రీతిన కొనుగోళ్లను కొనసాగిస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ బలంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఇప్పుడు చైనా కేంద్ర బ్యాంకు తీసుకోబోయే తదుపరి చర్యలను, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల గమనాన్ని నిశితంగా గమనిస్తున్నారు.

