జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో కార్చిచ్చులా అల్లుకుని ఉండాల్సింది. కానీ అంత ఊపు కనిపించడం లేదు. అభిమానులు, టాలీవుడ్ లవర్స్ నుంచి భారీగా స్పందన ఉంది కానీ న్యూట్రల్ హ్యాండిల్స్, ఇతర భాషల ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ అయితే లేదు. కారణం సింపుల్. థీమ్ ని చెప్పే ఉద్దేశంలో టీమ్ ఏఐ టెక్నాలజీ మీద ఆధారపడటమే.
మేకర్స్ ఎవరైనా ఏ సినిమా అయినా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. ఏఐ వాడకం చాలా సులువైపోయింది. ఎలా వాడాలో అర్థం కాకపోతే అదే ఏఐని టిప్స్ అడిగితే చిన్న పిల్లలకు పాఠం చెప్పింది అప్పజెబుతోంది. దాన్ని ఫాలో అవుతూ అద్భుతాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంజినీరింగ్, సాఫ్ట్ వేర్ నైపుణ్యం అవసరం లేకుండానే తమ టాలెంట్ చూపిస్తున్నారు. అలాంటప్పుడు వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్యాన్ ఇండియా మూవీస్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం అలసత్వం చూపించకూడదు.
దీనికే కాదు డ్రాగన్ టీజర్ వీడియోలో సగం ఏఐతోనే డిజైన్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆర్టిస్టులను రివీల్ చేసే వరకు వచ్చే వరకు విజువల్స్ అన్నీ అలా సృష్టించినవే, అంచనాలు విపరీతంగా ఉన్నప్పుడు కంటెంట్ సహజంగా, గ్రాఫిక్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడాలి. అది చిన్న పోస్టర్ అయినా విపరీతమైన శ్రద్ధ అవసరం. లేదంటే లేనిపోని ట్రోలింగ్ తో పాటు ప్రాజెక్టు మీద అంచనాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
అయినా ఇంత అత్యవసరంగా ఇలా ఏఐతో చేసిన ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. డ్రాగన్ విడుదల ఇంకా ఏడాది ఉంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ 2029 కంటే ముందే వస్తే గొప్పే. అలాంటప్పుడు ఇంకాస్త టైం ఎక్కువగా నాణ్యత మీద ఫోకస్ పెడితే బాలీవుడ్ జనాలను కూడా కుదిపేయొచ్చు. రాజమౌళి ఎందుకు పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడతారో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అందుకే ఆయన్ని జక్కన్న అనేది.

