ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేయడంద్వారా తమను పరిపాలించే అర్హత కలిగిన నాయకులను ఒక నిర్ణీత కాలం ఎన్నుకుంటారు. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని గొప్పగా చెప్పుకుంటాం. ఇటీవల కాలంలో ఈ పద్ధతి ఏదో తిరగబడుతున్నట్టు ఉన్నది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా పాలకులను ఎన్నుకోవడం కాకుండా తమను ఎన్నుకునే ఓటర్లను పాలకులే ఎంపిక చేసుకుంటున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులను బట్టి అనిపిస్తుంది. ఒక సంవత్సరం క్రితం జూన్ 24వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో ఒకదానిని ప్రారంభించింది. అది బీహార్ రాష్ట్రంతో మొదలైంది. ఈ నెల 24వ తేదీతో ఈ కార్యక్రమం మొదలై సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరంలో మొత్తం ఆరుకోట్ల ఓట్లు తొలగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా చెబుతున్న లెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితాలలో సవరణలు చేయడం అనేది కొత్తేమీ కాదు. తప్పు కూడా కాదు. 1952 నుండి 2004 వరకు దాదాపు 13 సార్లు ఓటర్ల జాబితాలను సరి చేయడం కోసం అవసరమైన సర్వేలు జరిగాయి. అసలు ఈ సవరణల ఉద్దేశం ఏమిటి? ఓట్ల సవరణ ఏ కారణాల చేత జరగాలి? ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్యలో ఎవరైనా చనిపోయి ఉంటే వారి పేర్లు జాబితాలోంచి తొలగించాలి, ఒకచోట ఓటు కలిగిన వారు వేరే ప్రాంతాలకు తరలిపోతే ఇక్కడ వారి ఓటు తొలగించాలి. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే కూడా ఎక్కడి ఓటు తొలగించాలో, ఎక్కడి ఓటు ఉంచాలో ఆ ఓటరు ఆమోదంతోనే నిర్ణయించాలి. ఓటు అర్హత లేని వారు అంటే అక్రమంగా దేశంలోకి ప్రవేశించి నివాసం ఉంటున్న వారికి ఓటు హక్కు ఉంటే అదీ నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందే. ఇవి ప్రధానంగా తీసుకోవాల్సిన అంశాలు.
ఇప్పుడు గత ఏడాది నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అవే అయితే కేవలం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఈ కార్యక్రమం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా?. బీహార్‌లో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో 50లక్షల ఓట్లు గల్లంతయినట్లు సమాచారం. అట్లాగే ఉత్తరప్రదేశ్‌లో రెండు కోట్ల 89 లక్షలు, పశ్చిమ బెంగాల్ దగ్గరికి వచ్చేసరికి 20 లక్షల పైగా ఓట్లు తొలగించినట్లు సమాచారం. ఇప్పుడు దాదాపుగా మరో 19 రాష్ట్రాలలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఎన్నికల అక్రమాలను అరికట్టడం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎంతో అవసరం అన్న విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం వివిధ ఎన్నికలు నిర్వహించబడుతున్న ప్రజలలో, రాజకీయ పక్షాలలో, తీవ్రమైన అవిశ్వాసం నెలకొని ఉన్న కారణంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున వివాదస్పదమైంది.
ఇక మరో రెండున్నర ఏళ్ళలో శాసన సభ ఎన్నికలు జరగవలసిన తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో దక్షిణాదిలో అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి బిజెపి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో మాత్రమే భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా అధికారంలో ఉంది. కేరళ, కర్ణాటక, తెలంగాణ మూడు రాష్ట్రాల కాంగ్రెస్ కైవసమై తాజాగా తమిళనాడు దాదాపు రెండు దశాబ్దాల అనంతరం కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఏర్పడటం బిజెపి పెద్దలకు కొరుకుడు పడని విషయం. కాబట్టి దక్షిణాదిలో తెలంగాణను తమ గెలుపునకు ప్రయోగశాల చేసుకోవాలని బిజెపి ఎంపిక కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న ఈ వివాదస్పద కార్యక్రమం ద్వారా ఏమైనా లాభం పొందవచ్చని బిజెపి కోరుతున్న ప్రచారం జరుగుతోంది. విమర్శకులు బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఎన్నికలను ఉదాహరణగా చూపుతున్నారు.
భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఎక్కడైనా ప్రజల మద్దతు ఉంటే అధికారంలోకి రావడానికి ఎవరికీ ఎటువంటి అభ్యంతరం దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. అయితే పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకోగలిగినంత మద్దతు బిజెపికి తెలంగాణలో ఉందా అన్న ప్రశ్నకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో అయినా, విభజన అనంతరం తెలంగాణలో అయినా భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికలలో లేదా లోకసభ ఎన్నికలలో అంత గొప్ప ప్రజామోదం పొందిన పరిస్థితులు గతంలో అయితే లేవు. ఎవరైనా అయిదేళ్ల క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత 2024లో జరిగిన లోకసభ ఎన్నికల ఫలితాలు చూపించి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ప్రజామోదం చాలా ఉందని చెప్పే ప్రయత్నం చేయవచ్చు. జిహెచ్ఎంసి ఎన్నికలలో పట్టణ ప్రాంతమైన హైదరాబాద్‌లో కొన్ని కార్పొరేటర్ స్థానాలు గెలవడం యావత్ తెలంగాణ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించదు. ఇక 2024 లోకసభ ఎన్నికల విషయానికొస్తే తెలంగాణలోని 17 లోకసభ స్థానాల్లో ఒకటి మజ్లిస్‌కు పోతే ఎనిమిది కాంగ్రెస్, ఎనిమిది బిజెపి గెలుచుకున్న సగం బిజెపి బిజెపికి ప్రజామోదం కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు అధికారంలో ఉండి 2023లో ఓటమిపాలైన రాష్ట్ర సమితి, 2024 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన కారణంగా తెలంగాణలోని 2024 లోకసభ స్థానాలకు కాడి పారేసింది. లోకసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కాడి కింద పారేయడానికి దారితీసిన కారణాలేమిటో బిజెపికి బాగా తెలుసు. మరి తెలంగాణలో ఒంటరి పోరాటం చేసి అధికారంలోకి వస్తామన్న నమ్మకం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, హోం మంత్రి అమిత్ షా కి ఎక్కడి నుంచి వచ్చిందో? తెలంగాణలో ప్రధానంగా పనిచేస్తున్న పార్టీలు అంటే అధికారం అనుభవించిన లేదా అధికారానికి రాగల సత్తా ఉన్న పార్టీలు కాంగ్రెస్, టిఆర్ఎస్ తర్వాత బిజెపి. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండున్నర సంవత్సరాల్లో బిజెపి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తన పరిస్థితి ఏ విధంగా మెరుగుపరుచుకోగలదో?
ఎందుకంటే లోకసభ ఎన్నికల్లో సగానికి సగం సీట్లు గెలుచుకొని అందులో ఇద్దరిని కేంద్ర మంత్రులుగా నియమించుకొని రెండు సంవత్సరాలు సాధించినా తెలంగాణ ప్రజలలో బిజెపిపట్ల అనుకూలత పెరిగింది. ఇక్కడ ఒక విషయం, తాను సనాతన హిందువును అని, ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా తనతో పోటీ కాదని అనునిత్యం నిరూపించుకో చూస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ తెలంగాణలో తాము అధికారంలోకి రావడానికి ఏమన్నా పనికొస్తారేమో అన్న ఆలోచన బిజెపికి ఏమైనా ఉందా? ఎందుకంటే తమిళనాడులో చూసాం, పార్టీ పేరుతో గెలమని అర్థం అయిపోయి ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి, అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిజెపికి అత్యంత విశ్వాసపాత్ర అన్నామలై బిజెపి నుంచి నిష్క్రమించడం, ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయడం బిజెపి అనుసరించే వ్యూహంగా కనిపిస్తోంది. అన్నామలై ఆ మధ్య ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి, పార్టీ తనకు ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని తిరస్కరించి, తాను పార్టీ వీడి ప్రాంతీయ పార్టీ స్థాపించబోతున్నట్టు చెప్పి కృతజ్ఞతలు తెలిపి వచ్చారన్న వార్తలు వెలువడ్డాయి. ఇంకో ప్రచారం కూడా ఉంది. అన్నామలై బిజెపి ఆశీస్సులతోనే ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసాడని, అందుకే అమిత్ షాను కలిసారని. ఇందులో ఎంత నిజం ఉందో కానీ అది నిజంగా బిజెపి నిర్ణయమే అయినట్లయితే తమిళనాడుకి ఇంకో దారిలో వస్తున్నదనుకోవాలి. ద్రవిడ రాజకీయాలు చాలా బలంగా వేళ్ళూనుకున్న తమిళనాడులో అన్నాడిఎంకెని తన పక్షం చేసి పోటీ చేసి బిజెపి కేవలం ఒక్క శాసనసభ కోసం గెలిచిన విషయం. ఏ రాజకీయ నేపథ్యం లేని ఒక సినిమా నటుడు విజయ్ అత్యధిక స్థానాలు సాధించడం తోనే అర్థమైంది కదా తమిళనాడులో బిజెపి పప్పులు ఊడికే పరిస్థితి లేదు. అందుకే అక్కడ అన్నామలైని ప్రాంతీయ పార్టీ రూపంలో ప్రవేశపెట్టిందని ప్రచారం. అట్లాగే తెలంగాణలో సినీ నటుడిగా అభిమానుల ఫాలోయింగ్ ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ప్రయోగిస్తున్నదేమో బిజెపి అన్న అనుమానం కలిగించే సంఘటన ఒకటి ఈ నెల రెండవ తేదీన జరిగింది. జనసేన తెలంగాణ శాఖ సమావేశం నిర్వహించే పేరుతో హైదరాబాద్ వచ్చి పవన్ ప్రాంతీయ అస్తిత్వానికి జాతీయ వ్యతిరేకవాదం రంగు పులిమే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలతో ముఖం వాచేట్లు చివాట్లు తిని వాపస్ వెళ్ళినప్పుడు అందరికీ అనుమానం వచ్చింది. కేంద్ర పెద్దల ఆశీస్సునే ఆయన తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తున్నాడేమో అని. అటువంటి ఆలోచన ఒక వేళ బిజెపి పెద్దల్లో ఏ కోశానా ఉన్నా తెలంగాణ వరకు అది ఆత్మహత్యా సదృశమే.
బిజెపి కొంచెం ఊహిస్తున్నదా అనే సందేహం అప్పుడప్పుడు జరిగే పరిణామాలవల్ల కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీ తెలుగుదేశంతోకగా బిజెపితో కూడా కలిసి పోటీచేసి ఉండకపోతే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. ఒంటరిగా 2019లో అది రుజువు కూడా అయింది. సరే ఇప్పుడు మళ్లీ తెలంగాణలో జరుగుతున్న సర్ కార్యక్రమం, బెంగాల్ తరహాలో తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాం అని చెబుతున్న బిజెపి ఆలోచన రెండిటికీ ముడివేసి చూస్తే బిజెపిని వ్యతిరేకిస్తున్న రాజకీయపక్షాలే కాదు తెలంగాణలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 89లక్షల ఓట్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు తేలిందని చెప్తున్నారు. ఇప్పుడా ఓట్లన్నీ తొలగిస్తారా లేక వ్యత్యాసాలన్నిటినీ సరిచేసి ఓట్లన్నీ ఉంచుతారా? 89 లక్షల ఓట్లు అంటే సగటున నలుగురు ఓటర్లలో ఒకరి ఓటు అనుమానాస్పదమైందన్న విషయం ఆందోళన కలిగించేదే.
ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గాని ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నుండి ఎప్పుడు పెద్దగా అభ్యంతరాలు లేవు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019లో జరగాల్సిన శాసనసభ ఎన్నికలను అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కొంచెం ముందుగా 2018 లోనే ఎన్నికలకు వెళ్లిన కారణంగా తెలంగాణలో అప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు 2019లో ఆంధ్ర వెళ్లి ఓట్లు వేశారు. అట్లాగే మళ్లీ తెలంగాణలో 2023, ఆంధ్రాలో 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రెండుసార్లు ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. అది హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు, అక్కడక్కడా చెదురుముదురుగా కొన్ని చోట్ల స్థిరపడిన ఆంధ్రులు ఇట్లా రెండుచోట్ల ఓట్లు వినియోగించుకున్నారు. అటువంటి వారి సమ్మతంతోనే తెలంగాణలో ఓటు హక్కు కావాలా, ఆంధ్రాలో కావాలా నిర్ణయించుకోమని ఒకచోట ఓటు తొలగించే పని ‘సర్’ చేయాల్సిన పని. అట్లాగే చనిపోయిన వారి పేర్లను, ఈ రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించాల్సిందే. అంతేగాని ఒక్కసారిగా ఇన్ని లక్షల ఓట్లలో తేడాలు ఉన్నాయని తొలగించే ప్రయత్నం చేస్తే మాత్రం జనాగ్రహానికి గురికాక తప్పదు.
తెలంగాణలో రాజకీయ పక్షాలే ఈ ‘సర్’ కార్యక్రమంలో గందరగోళంలో ఉన్నాయి. విద్యావంతులు, మేధావులు కూడా సరిగా అర్థం కాక ఇబ్బందిపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ జటిలమైన ప్రక్రియ గ్రామీణ ప్రాంత పేదలకు, నిరక్షరాస్యులకు ఏం అర్థం అవుతుంది? అట్లా అని వదిలేస్తే అర్హులైనవాళ్ళు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కోల్పోతారు. అట్లా జరగకుండా ఉండాలంటే మనం జెన్‌జీ అని పిలుస్తున్న తరం కదలాలి. 18ఏళ్లు నిండిన యువత కచ్చితంగా ఓటు హక్కు పొందేలా చూసుకోవడమే కాకుండా అర్హులైన ఓటర్లు ఎవరికి అన్యాయం జరగకుండా చూసే ప్రక్రియలో పాల్గొనాలి. ఈనాటి యువత కేవలం సోషల్ మీడియాలో విమర్శలు చేయడానికి పరిమితం కాకుండా దేశ భవిష్యత్తును మార్చే ఓటు హక్కును పొందేందుకు ప్రజలకు అధికారాన్ని కాపాడే పనిలో భాగస్థులు కావాలి. తమ ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత కూడా పౌరులదే. చివరగా ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా, దాని విశ్వసనీయతకు ఒక పరీక్ష. ప్రక్రియ పారదర్శకంగా జరిగితే ప్రజల హర్షిస్తారు. లేదా ఓటర్లు ఏలికలను పర్సన్ లేదు, ఏలికలే వారికి కావాల్సిన ఓటర్లు ఎంపికయ్యారు అన్నమాటే నిజం అవుతుంది.
దేవులపల్లి అమర్

