ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవి.. అని చెప్పిన పాపాన పోలేదు. అంతేకాదు..అత్యంత క్లిష్టమైన అంశాలైన తిరుమల శ్రీవారి లడ్డూ నుంచి డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర దుర్భాషల వ్యవహారం తెరమీదకు వచ్చినప్పుడు బీజేపీ నోరు విప్పలేదు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు రెండు సార్లు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి.. హితవు పలికారు.
కూటమి ప్రభుత్వం తరఫున అందరూ కలసి కట్టుగా ప్రజల మధ్యకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని కూడా ఆయన సూచించారు. అయిన’ప్ప’టికీ.. బీజేపీ నాయకులు చంద్రబాబు మాటలు విన్నారే కానీ.. ఎవరూ నోరు విప్పలేదు ప్రజల మధ్యకు రాలేదు. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులపై పన్నెత్తు మాట కూడా విమర్శించలేదు. కానీ, తాజాగా ఇప్పుడు బీజేపీ అడుగులు ముందుకు పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లేందుకు ముందుకు వస్తున్నాయి.
తాజాగా గురువారం బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్.. పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పందించారు. ఈ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం, అప్పటి ముఖ్య మంత్రి జగన్ గాలికి వదిలేశారని విమర్శించారు. ఇదేసమయంలో సీఎం చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నార’ని చెప్పారు. అంతేకాదు.. పోలవరం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దనున్నట్టువివరించారు.
ఈ మార్పు వెనుక!
ఇక.. ఈ మార్పు వెనుక కీలక కారణం ఏంటనేది ఆసక్తిగా మారింది. గత రెండు సంవత్సరాల్లో బీజేపీ నోరు విప్పలేదు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా తెర ముందుకు రావడం హర్షణీయమే అయినా.. దీని వెనుక కీలక కారణం ఉందని అంటున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఈ ఎన్నికలపై భారీగానే ఆశలు పెట్టుకుంది. అయితే.. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేనల మద్దతు లేకపోతే.. స్థానికంగా అనుకున్న ఫలితం రాబట్టడం అంత ఈజీకాదు. అందుకే.. మార్పు దిశగా కమల నాథులు అడుగులు వేయకతప్పలేదన్న చర్చ సాగుతుండడం గమనార్హం.

