మన తెలంగాణ/హైదరాబాద్/కాళేశ్వరం: సరస్వతీ అంత్య పుష్కరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కంచి స్వామీ విజయేంద్ర సరస్వతీ, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాలచే తొలి పుష్కర స్నానంతో ఈ పుష్కరాలు ప్రారంభం అవుతాయి. నేడు (గురువారం) తెల్లవారు జామున 5.43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాలు పుష్కర స్నానం చేసి అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. పుష్కర స్నానాలు 21వ తేదీ నుంచి 12 రోజుల పాటు (జూన్ 1 వరకు) జరుగుతాయి. ఈ పుష్కరాలకు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.
భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సిఎం అధికారులను నియమించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆయన సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు ఆరోగ్యం కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరగాలని సిఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌రెడ్డి పుష్కర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతిరోజు ఒక స్వామిజీ పుష్కరసాన్నం
గత సంవత్సరం జరిగిన సరస్వతీ ఆది పుష్కరాల సందర్భంగా జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంత్య పుష్కరాలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పుష్కర ఘాట్ వద్ద కాయర్ మ్యాట్లు, చలువ పందిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పుష్కర ఘాట్ పరిసరాల్లోని 23 వాహనాల పార్కింగ్, బిటి రోడ్ల నిర్మాణాన్ని పెంచుతుంది. ఈ పుష్కరాల పనుల కోసం ప్రభుత్వం రూ. 30.63 కోట్ల నిధులను కేటాయించింది. నేటి నుంచి జూన్ 1 వతేదీ వరకు ప్రతిరోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజీ ఈ పుష్కరాల్లో పాల్గొని పుణ్య స్నానం చేస్తారు.
ప్రతిరోజూ ఉదయం హోమాలు
ప్రతిరోజూ ఉదయం హోమాల నిర్వహణ, సాయంత్రం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 90 షటిల్ బస్సులను ఏర్పాటు చేశారు. రెస్క్యూ బృందాలతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన 100 మంది గజ ఈతగాళ్లను సరస్వతీ ఘాట్, నదీ ప్రాంతంలో నియమించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.1.20కోట్లతో ప్రత్యేకంగా మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నాగేంద్ర స్వామి ఆలయాన్ని రూ.30 లక్షలతో పునర్నిర్మాణం చేశారు. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ హోమాలు నిర్వహించే హారతి, తెప్పోత్సవం లకు పెద్ద ఎత్తున ఏర్పాట్లను నిర్వహించారు. పుష్కరాలకు హాజరయ్యే వారి సౌకర్యార్థం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించారు.
300 మంది వైద్యాధికారులతో మెడికల్ క్యాంపులు
దాదాపు 500 టాయిలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా మరో రెండు ఓహెచ్ఆర్లను నిర్మించారు. వాహనాల కోసం ఏర్పాటు చేసిన 23 పార్కింగ్ కేంద్రాల్లో మరిన్ని సౌకర్యాలతో పాటు టాయిలెట్ ఏర్పాటు చేశారు. 300 మంది వైద్యాధికారులతో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం పుష్కర ఘాట్‌లోని 23 జోన్లలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన ప్రాంతాలను అంబులెన్సులను రెడీగా ఉంచారు. మహాదేవ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెఫరల్ ఆసుపత్రిగా ఏర్పాటు చేశారు.
1.70 లక్షల వాహనాల పార్కింగ్ కోసం 245 ఎకరాల్లో ఏర్పాట్లు
245 ఎకరాల్లో 1.70 లక్షల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ఏరియాలతో పాటు ఘాట్లు, టెంపుల్ తదితర ప్రాంతాల్లో 200 సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ 12 రోజులపాటు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. పుష్కర ఘాట్లలో నిరంతరం విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టారు. పుష్కర స్నానాల సందర్భంగా ఎలాంటి వాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సుమారు 100 మంది గజ ఈతగాళ్లను నియమించారు. వీటితోపాటు సెఫ్టీ బోట్స్, లైఫ్ రింగ్స్, ఎస్డిఆర్ఎఫ్ టీంలను నియమించారు. పుష్కర కార్యక్రమాల గురించి ప్రజలకు సమాచారం అందించారు మీడియా సెంటర్ సైతం.

