తెలంగాణ:తెలంగాణలో మరో అవినీతి కేసు సంచలనం రేపుతోంది.మేడ్చల్,రంగారెడ్డి జిల్లాలకు చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ (డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్)నివాసాలు, ఆయనకు సంబంధించిన పలుచోట్ల ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై వంశీ మోహన్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు,హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.సోదాల్లో భారీ స్థాయిలో స్థిరాస్తులు,పత్రాలు,లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం.
వంశీ మోహన్ గతంలో శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.ముఖ్యంగా ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసి,రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు.
అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపూర్ ప్రాంతాల్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని, తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓ ప్రముఖ రియల్ టర్ నుంచి 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తీసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు.సోదాల పత్రాల ఆధారంగా వంశీ మోహన్‌కు చెందిన ఆస్తుల విలువ రూ.వందల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ కేసులో మరికొందరు అధికారులు, రియల్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు విస్తరించే అవకాశం ఉందని సమాచారం.


