– ప్రకటన –
యాప్ ద్వారా వెలుగులోకి వచ్చిన అక్రమాలు
డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు, అరెస్టు
వ్యవసాయ అధికారిని కూడా సస్పెండ్ చేశాం
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిద్దిపేట ఆరు వేల యూరియా బస్తాలు మాయమయ్యనే జిల్లాలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా గుర్తించామనీ, ఇద్దరు హోల్‌సెల్ డీలర్లు, ఒక రిటైలర్ లైసెన్సు రద్దు చేయడంతో పాటు అరెస్టు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విషయంలో వ్యవసాయ అధికారిని కూడా సస్పెండ్ చేసారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఫర్టిలైజర్ యాప్ ద్వారా కాపీ లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదవుతున్నందున తప్పుడు ఎంట్రీలు, కల్పిత బిల్లులు, అక్రమ నిల్వలు, యూరియా మళ్లింపులను సులభంగా గుర్తించామని తెలిపారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో, ఒక సొసైటీ ప్లాస్టిక్ సరఫరాలో జరిగిన అక్రమాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరఫరా పంపిణీలో పారదర్శకత కోసం యూరియా యాప్‌ను సరిగ్గా అమలు చేయడం వల్ల అక్రమదారులకు అన్ని మార్గాలు మూసుకుపోయాయని తెలిపారు.
గతంలో కొందరు అక్రమంగా ప్రయివేటు సంస్థలకు యూరియాను విక్రయించి రైతులను మోసం చేసే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అలాంటి అవకాశాలకు పూర్తిగా అడ్డుకట్ట పడిందని వివరించారు. ప్రస్తుతం 3.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటిదాకా రాష్ట్రానికి రావాల్సిన ఆరు లక్షల మెట్రిక్ టన్నులు యూరియాలో 5.62 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి తెప్పించగలిగామని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చి, రాష్ట్రానికి అవసరమైన యూరియాను సకాలంలో అందుబాటులోకి తీసుకురాగలమని వివరించారు. యూరియా యాప్‌పై కొందరు అసత్య ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఇప్పటివరకు యూరియా యాప్ ద్వారా 52.30 లక్షల బస్తాల యూరియాను రైతులు బుక్ చేసుకోగా, అందులో 46.03 లక్షల బస్తాలను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 79.29 లక్షల బస్తాల యూరియా అందుబాటులో ఉంది. రైతుల ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనీ, ఎరువుల సరఫరా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
– ప్రకటన –

