ఏపీ రాజధాని అమరావతిపై చర్చ జరుగుతున్న సమయంలో కీలక అధికారి, మాజీ ఐఏఎస్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అసలు ఎందుకిలా జరిగింద’ని ఆయన ప్రశ్నించారు. దీనితో ప్రస్తుతం సదరు అధికారి రాజీనామా వ్యవహారం కూడా చర్చకు దారి తీసింది.
ఎవరాయన?
మాజీ ఐఏఎస్ అధికారి ఎస్వీఆర్ శ్రీనివాస్. ఆయనను కూటమి ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకుని అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌ను చేసింది. ప్రాథమిక సదుపాయల కల్పన రంగంలో విశేషమైన అనుభవం ఉన్న నేపథ్యంలో రాజధానిలో మౌలిక సదుపాయాల విషయంలో శ్రీనివాస్ అనుభవాన్ని వినియోగించుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆయన ఆధ్వర్యంలో అంతర్జాతీయ విమానాశ్రయం సహా.. ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహాలకు సంబంధించి డిజైన్లను కూడా రూపొందించారు.
అయితే.. శ్రీనివాస్ తనపదవికి రాజీనామా సమర్పించి.. వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతోపాటు.. అసలు జరిగిందని కీలక అధికారులను ఆరా తీశారు. వాస్తవానికి గత పది రోజుల కిందటే శ్రీనివాస్ తన రాజీనామాను సమర్పించారు. కొద్దికాలంగా రాజధాని వ్యవహారంలో తనా అధికారాలకు సంబంధించి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా సమర్పించారని.
సిఆర్డిఏ ఏర్పాటైన తరువాత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి రాజీనామా సమర్పించడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక, తన రాజీనామాలో శ్రీనవాస్.. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని అందుకే తాను రాజీనామా సమర్పిస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుంటే.. ఓ మంత్రికి, శ్రీనివాస్‌కు మధ్య అంతర్గత వివాదాలు కొనసాగుతున్నాయని, తనకు ఆఫీసు నిర్వహణ, సిబ్బంది లేకుండా చేశారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇదే కాదు.. గతంలోనూ ఇద్దరు ఐఏఎస్ అధికారులు తమ పదవులను వదిలేసి వేరే విభాగాలకు వెళ్లిపో యారు. సీఆర్ డీఏ కమిషనర్లుగా పనిచేసిన కన్నబాబు సహా మరో అధికారి కూడా మంత్రితో విభేదించరన్న చర్చ అప్పట్లోనూ సాగింది. ప్రస్తుతం శ్రీనివాస్ రాజీనామాతో మౌలిక సదుపాయాల కార్యక్రమాలు కొంత మందగమనంలో సాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

