సీఎం విజయ్ పై అనుచిత వ్యాఖ్యలపై కేసు
చెన్నై: తమిళనాట రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల అనంతరం అధికార టీవీకే ప్రభుత్వం, సీఎం విజయ్ పై ప్రతిపక్ష డీఎంకే విమర్శలకు దిగుతోంది. విజయ్ ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసి కొందరు నాయకులు విమర్శిస్తున్నారు. దీని కారణంతో తాజాగా డీఎంకే ఎమ్మెల్యే అనిత ఆర్.రాధాకృష్ణన్ అరెస్ట్ అయ్యారు. టీవీకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు ఆయనను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మద్రాస్ హైకోర్టులో ఆయన వేసిన ముందస్తు బెయిల్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చడంతో పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 20న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ పై రాధాకృష్ణన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ నటి ప్రస్తావనను తీసుకువచ్చారు. ఈ విధంగానే ఆయనపై కేసు నమోదైంది. తాజాగా హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. కాగా, ఈ అరెస్టును డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆమె తెలిపారు.

