పొరపాట్లు అంటే ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. కానీ అదే పనిగా రిపీట్ చేస్తే దాన్ని తప్పు అంటారు. బాలీవుడ్ హీమ్యాన్ హృతిక్ రోషన్ వరస చూస్తే అలాగే ఉంది. అల్ఫాలో ఏజెంట్ కబీర్ గా క్యామియో చేయడం విమర్శలకు దారి తీస్తోంది. గతంలో దురంధర్ నచ్చింది కానీ అందులో రాజకీయాలను నేను సమర్థించలేనని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ కండల వీరుడు, మరి అల్ఫాలో యుద్ధం వల్ల పాకిస్థాన్ కి ఏదో నష్టం జరిగిందనే రీతిలో ఉన్న విలన్ పాత్రని చూశాడో లేదో.
వార్ పెద్ద విజయం సాధించింది. నిజమే. అందులో సందేహం లేదు. అంతమాత్రాన యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే ప్రతి స్పై సినిమాలో అదే పాత్ర చేస్తూ పోతే దాని విలువ తగ్గిపోతుంది. వార్ 2 డిజాస్టర్ తర్వాత కూడా ఈ పాఠం నేర్చుకోకపోవడం విచిత్రం. అంత మొహమాటంగా ఎందుకు ఒప్పుకోవాలని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. ఒకప్పుడు హృతిక్ ఫైట్లు చూసి వావ్ అన్న ఆడియన్సే ఇప్పుడు అల్ఫాలో పోరాటాలు చూసి ఫిజిక్స్ జోక్స్ గా వీడియోలను ట్రోల్ చేస్తున్నారు.
గత ఆరు సంవత్సరాల్లో హృతిక్ చేసిన ఫుల్ లెన్త్ మూవీస్ కేవలం మూడే. తమిళ రీమేక్ ‘విక్రమ్ వేదా’ బాక్సాఫీస్ వద్ద తుస్సుమంది. ‘ఫైటర్’ గట్టెక్కింది కానీ అది కూడా చాలా బాగుందనే ముద్ర వేయించుకోలేదు. ఇక ‘వార్ 2’ గురించి తెలుస్తుంది. హృతిక్ కే కాదు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా పీడకలగా నిలిచిపోయింది. ఇప్పుడు అల్ఫా వంతు వచ్చింది. భారీ ఫాలోయింగ్ ఉన్నపుడు ఇంత నెమ్మదిగా సినిమాలు చేయడం పట్ల మూవీ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
క్రిష్ 4 కూడా ముందుకు వెళ్లట్లేదు. బడ్జెట్ సమస్యల ఆలస్యమవుతోందని దర్శక నిర్మాత, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ చెబుతూ వస్తున్నారు కానీ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో అంత చిక్కడం లేదు. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా క్రిష్ 4 ఎప్పటికీ వెలుగులోకి రాకపోడానికి ముంబై టాక్. కానీ రాకేశ్ బృందం మాత్రం ఎంత ఆలస్యమైనా సరే జరిగి తీరుతుందని బల్లగుద్ది చెబుతున్నారు. ఏది ఏమైనా తన నిర్ణయాలను హృతిక్ సమీక్షించుకోవడం ఉత్తమం.

