ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు మరింత చేరువయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఎవరో రావాలి.. ఏదో చెప్పాలి.. అని ఎదురు చూడకుండా.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఆయన.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తనసొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలను నేరుగా కలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు తీసుకున్నారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చిన చంద్రబాబు శనివారం నేరుగా ప్రజలతో మమేకమయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సీఎంతో భేటీ అయ్యేందుకు వచ్చారు. అయితే.. వారిని హాల్లోనే కూర్చోబెట్టిన సీఎం.. అప్పటికే బయట వేచి ఉన్న ప్రజలను కలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. సమస్యలు తెలుసుకున్నారు. అలానే.. స్వర్ణ కుప్పం ప్రాంత అభివృద్ధిని వారికి వివరించారు. ప్రతి ఇంటి సోలార్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను చెప్పారు. విద్యుత్ వినియోగంలో సౌర విద్యుత్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
ఇక, వ్యక్తిగత సమస్యలను కూడా తెలుసుకున్న చంద్రబాబు పలువురికి అక్కడికడ ఆర్థిక సాయం ప్రకటించారు. కొందరికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించారు. ఇక, కుప్పం నియోజకవర్గం గ్రామాలలోని పరిధిలో అవలంభిస్తున్న నెట్ జీరో(వ్యర్థాల రహిత) వ్యవస్థను అడిగి తెలుసుకున్నారు. పలు ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థ గురించి తెలుసుకున్నారు. అలానే విద్యుత్ వినియోగంతో నడిచే ఇండక్షన్ కుక్కర్లు, టెర్రస్ గార్డెనింగ్ వంటి వివరాలను పలువురు చంద్రబాబుకు చెప్పారు.
ఎందుకిలా?
మారుతున్న రాజకీయ వాతావరణం.. ప్రజల అభిరుచులకు అనుగుణంగా చంద్రబాబు తనను తాను మార్పు చేసుకుంటూ పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలో గతానికి భిన్నంగా ఆయన ఈ ఏడాది పలుమార్లు పర్యటించారు. ప్రతి ఒక్కరికీ చేరుతున్నారు. తద్వారా వైసీపీ వ్యూహాత్మక రాజకీయాలకు పరోక్షంగా చంద్రబాబు చెక్ పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

