వైద్యురాలి మృతి కేసులో దోషిగా తేల్చిన రౌస్ ఎవెన్యూ కోర్టు
న్యూఢిల్లీ: బీహార్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజుకుమార్ సింగ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. ఓ వైద్యురాలు మృతి కేసులో ఆయన దోషిగా తేలడంతో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2019 నూతన సంవత్సర వేడుకల్లో జరిగిన ఫైరింగ్‌లో డాక్టర్ అర్చనా గుప్తా కనిపించిన కేసులో ఆయన్ను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం. ఈ కేసులో ఆయనకు జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి…
2018 డిసెంబరు 31 అర్ధరాత్రి ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో రాజుకుమార్ సింగ్ ఫామ్‌హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆయన గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఉన్న డాక్టర్ అర్చనా గుప్త(45) తలకు బుల్లెట్ తగలడంతో అక్కడే తీవ్రంగా గాయపడ్డారు. ఆమో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై నమోదైన కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం… గత జూన్‌లో రాజుకుమార్ సింగ్‌ను బీఎన్ఎస్-304(2) సహా ఆయుధ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారని దోషిగా తేల్చింది. అయితే…శిక్షను ఖరారు చేసే సమయంలో రాజుకుమార్ సింగ్‌కు ఎలాంటి హత్యోద్దేశం లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రజాప్రతినిధిగా ఆయనకు మంచి పేరుండడంతో శిక్షను తగ్గించాలని కోర్టును అభ్యర్థించారు. నేర తీవ్రతను తీసుకున్న న్యాయస్థానం… నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు 25 లక్షల రూపాయల జరిమానా విధించింది.

