టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంత మంది అతణ్ని అభిమానిస్తే.. కొంత మంది తనను అదే పనిగా ట్రోల్ చేస్తారు. ఇటు అభిమానులు, అటు వ్యతిరేకులు.. నాగవంశీని చింటు అని సరదాగా పిలుస్తుంటారు. ఈ విషయం ఇండస్ట్రీ జనాలకు కూడా బాగా తెలుసు. తనను చింటు పేరుతో చాలామంది ట్రోల్ చేస్తుంటారని తెలుసు.. నాగవంశీ ఆ విషయాన్ని సీరియస్‌గా ఏమీ తీసుకోడు.
మాస్ జాతర ఈవెంట్లో, ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో మాస్ రాజా రవితేజ పదే పదే నాగవంశీని.. చింటు చింటు అంటూ ఆటపట్టించడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం స్టేజ్ మీద నాగవంశీని చింటు చింటూ అంటూ సరదాగా కామెంట్ చేయడం విశేషం. నాగ్, నాగవంశీ కలిసి అక్కినేని అఖిల్‌ను హీరోగా పెట్టి లెనిన్ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం తిరుప తిలో జరిగింది. ఈ సందర్భంగా నాగ్.. నాగవంశీని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నాకో పార్ట్నర్ ఉన్నాడు.. మీరంతా చింటు అన్న అని పిలుస్తారట కదా అతణ్ణి.. అంటూ నాగ్ కామెంట్ చేయటంతో ఆడిటోరియం హోరెత్తింది. ఈ కామెంట్ విని నాగ వంశీ కూడా నవ్వేశాడు. తర్వాత నాగ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. లెనిన్ సినిమా విషయంలో అఖిల్‌కు, తనకు ఏ ఇబ్బంది రాకుండా నాగవంశీ అన్నీ సమకూర్చి పెట్టాడని, ఈ సినిమా పకడ్బందీగా తెరకెక్కేలా చూశాడని అన్నాడు.
చింటు అన్నకు మాస్ పల్స్ బాగా తెలుసు.. అతను ఈ సినిమా మీద ఎంతో నమ్మకంతో ఏపీ అంతటా లెనిన్‌ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడని, దీన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని నాగ్ అన్నాడు. లెనిన్ కచ్చితంగా బ్లాక్ బస్టార్ అవుతుందన్న ధీమాను నాగ్ వ్యక్తి చేశాడు. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళి కృష్ణ రూపొందించిన లెనిన్ రాబోయే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రం తమన్ సంగీతం అందించింది.

