Published on: 12:51 pm, 8 జూలై 2026
తమిళంలో టాప్ లీగ్ కథానాయకులకు చాలా దగ్గరగా వెళ్లిన మిడ్ రేంజ్ హీరోల్లో రవి మోహన్ అలియాస్ జయం రవి ఒకడు. ‘జయం’ సహా పలు తెలుగు సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్న అతను.. తర్వాత ‘తనీ ఒరువన్’తో భారీ విజయాన్ని అందుకున్నాడు. తమిళంలో అత్యధిక బడ్జెట్లో ప్రదర్శించిన మణిరత్నం కలల చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’లో అతనే లీడ్ రోల్ చేశాడంటే తన రేంజ్ అర్థం చేసుకోవచ్చు.
ఐతే ఈ మధ్య రవి పేరు.. సినిమాలతో వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన భార్య ఆర్తితో తీవ్ర విభేదాలు తలెత్తి రవికి దూరం కావడం.. తర్వాత కెనీషా అనే సింగర్‌తో సహజీవనం చేయడం చర్చనీయాంశమైంది. ఐతే కెనీషాను అదే పనిగా టార్గెట్ చేయడంతో పాటు తననూ వేధింపులకు గురిచేస్తోందంటూ తన భార్య ఆర్తి మీద అతను ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు ఈ గొడవ సెటిలయ్యే వరకు తాను సినిమాల్లో నటించడం సంచలనం రేపింది.
చాలా కూల్‌గా కనిపించే రవి.. ప్రెస్ మీట్లో అంత ఎమోషనల్ అవ్వడం, సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ ప్రకారమే కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడతను. తర్వాత మళ్లీ మీడియా ముందుకు కూడా రాలేదు. ఐతే ఇప్పుడు ఒక సినీ వేడుకలో రవి మాట్లాడుతూ.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. తన వ్యక్తిగత వివాదాలు తేలే వరకు సినిమాలు చేయనంటూ చేసిన ప్రకటనపై అభిమానులకు క్షమాపణ చెప్పాడు.
తన జీవితంలో ఒక దశ ముగిసిందని.. ఇప్పుడు కొత్తగా ఇంకో దశ మొదలవుతుందని.. ఇది తనకు మరో జన్మ అనుకుంటానని.. ఇకపై మంచి సినిమాలతో అలరించడమే తన ఉద్దేశంతో తాను పోషించిన ముఖ్య పాత్రల పేర్లు చెప్పి మళ్లీ అలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలనుకుంటున్నట్లు తెలిపాడు రవి. జయం రవి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘బ్రో కోడ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ.. రవికి జోడీగా నటించింది.

