తెహ్రాన్: అమెరికా, ఇజ్రాయిల్ దాడిలో తండ్రి, కుటుంబ సభ్యులను కోల్పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ప్రతీకారంతో రగిలిపోతున్నారు. కుటుంబ సభ్యులు, తమ దేశాన్ని నాశనం చేసిన అమెరికాపై పగ తీర్చుకుంటామని మొజ్తబా శపథం చేశారు. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. తండ్రి అంత్య క్రియలు పూర్తైన అనంతరం మొజ్తబా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు ఆయన ఈ విధంగా స్పందించారు. బాధ్యులైన వారు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రకటించారు. ఇది తమ దేశంలో ఉన్న డిమాండ్ అని…దానిని కచ్చితంగా నెరవేరుస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన టెలిగ్రామ్లో ఓ సందేశాన్ని విడుదల చేశారు.’మా నాయకుడితో పాటు అమరులైన వారందరి కోసం…ఆ హంతకులపై ప్రతీకారం తీర్చుకుంటాం’ అని అందులో పేర్కొన్నారు. ‘తనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ప్రతిస్పందన ఉంటుంది’ అని అమెరికా అధ్యక్షుడు ఇరాన్ను హెచ్చరించిన నేపథ్యంలో మొజ్తబా నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 28 నాటి అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందగా…9 ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన మొజ్తబా తండ్రి అంత్యక్రియల కోసం హాజరుకాలేకపోయారు.

