శ్రీ బద్రీనాథ్ ధామ్‌లో భక్తుల విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో అత్యంత ముఖ్యమైనదిగా కనిపించింది 32 రోజుల సీసీటీవీ ఫుటేజీ లేకుండా పోయినట్లు వెల్లడైంది. మొదట 45 రోజుల వీడియో రికార్డింగ్‌ను భద్రపరిచినట్లు అధికారులు తెలిపినా.. దర్యాప్తు బృందానికి అందులో 32 రోజుల ఫుటేజీ అందలేదని సమాచారం. ప్రస్తుతం ఆ వీడియోలను తిరిగి పొందేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఏర్పాటు చేసిన నాలుగు మంది సభ్యుల దర్యాప్తు కమిటీ విచారణ పూర్తి చేసి దేవస్థానం సీఈఓకు 18 పేజీల నివేదిక సమర్పించింది. ప్రాథమిక విచారణలో భక్తుల విరాళాలు, విలువైన వస్తువుల దుర్వినియోగం ఒక్కసారి కాదు, పలుమార్లు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విరాళాల లెక్కింపు గదిలో మరిన్ని సీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఘటనకు కేవలం 14 రోజుల ముందు సీసీటీవీ ఫుటేజీ మాత్రమే కనిపించినట్లు తెలిసింది. గతంలో ఏర్పాటు చేసిన కెమెరాల స్టోరేజ్ సామర్థ్యం కేవలం 15 రోజులకే పరిమితమై ఉండటంతో పాత రికార్డులు అందుబాటులో లేకపోయాయి. జులై 2 నాటి వీడియోలో నిందితుడు డబ్బు దుర్వినియోగం చేస్తున్న దృశ్యాలు కనిపించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఆ ఘటనకు ముందు 14 రోజుల ఫుటేజీలో కూడా కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం.
ఈ కేసులో పారదర్శకత కోసం జులై 7న శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రమోద్ నౌటియాల్‌ను సస్పెండ్ చేసింది. విధుల నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలియడంతో ఆయనకు ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం కమిటీ నిర్వహించిన విచారణలో ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు గుర్తించడంతో తదుపరి చర్యలు చేపట్టారు.

