విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చీకట్లు తొలగిపోతున్నాయి. చిన్నారుల భవిష్యత్‌కు పునాది వేసే అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ప్రత్యేక చొరవతో యుద్ధ ప్రాతిపదికన అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నారు. రాష్ట్రంలో 35,781 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 32,109 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అంటే దాదాపు 90 శాతం అంగన్వాడీ కేంద్రాలు విద్యుత్ వెలుగులతో కళకళలాడుతున్నాయి. మిగిలిన కేంద్రాలకు సైతం త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి నూరు శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేసింది. గతంలో దాదాపు 40 శాతం అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో చిన్నారులు, అంగన్వాడీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చీకటి గదులు, ఉక్కపోత వాతావరణంలో చిన్నారులు కేంద్రాలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి. ఫ్యాన్లు, లైట్లు లేకపోవడంతో వేసవి కాలంలో పిల్లలను కేంద్రాల్లో ఉంచడం అంగన్వాడీ కార్యకర్తలకు సవాల్‌గా మారేది. డిజిటల్ బోధనకు విద్యుత్ సైతం ప్రధాన అడ్డంకిగా నిలిచింది. ఈ పరిస్థితిని గుర్తించిన మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సైతం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నిర్ణయించారు. చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమైంది. విద్యుత్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క నిరంతరం సమీక్షలు నిర్వహించి కొత్త కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేశారు. శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్ కనెక్షన్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఫలితంగా 11,194 కేంద్రాలకు నూతనంగా విద్యుత్ సదుపాయం కల్పించారు. అయితే గత ఆరు నెలల వ్యవధిలోనే 9,800 కేంద్రాలు విద్యుత్ వెలుగులను సంతరించుకుంటున్నాయి. అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణ పురోగతిపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. “బలమైన భవిష్యత్‌కు బాల్యమే పునాది. చిన్నారులు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణంలో ఎదగాలి. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాల కల్పన తమ ప్రభుత్వ బాధ్యత. త్వరలోనే మిగిలిన కేంద్రాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించి నూరు శాతం లక్ష్యాన్ని సాధిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.
పోస్ట్ అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ వెలుగులు మొదట కనిపించింది విశాలాంధ్ర.

