గుర్రంపోడు, జూలై 16 : పోగొట్టుకున్న బంగారం, మొబైల్ ఫోన్, నగదును అరగంటలోనే పోలీసులు గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ పర్వీన్ (తండ్రి షాబుద్దీన్) గుర్రంపోడు నుండి తేనేపల్లి గ్రామానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో తన పర్స్‌ను పోగొట్టుకుంది. ఆ పర్స్‌లో సుమారు ఒక తులం బంగారం, మొబైల్ ఫోన్, రూ.2 వేల నగదు ఉంది. ఈ విషయమై బాధితురాలు గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన గుర్రంపోడు పోలీసులు మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చేపట్టి, అరగంట వ్యవధిలోనే పోగొట్టుకున్న పర్సును గుర్తించి, అందులోని బంగారం, మొబైల్ ఫోన్, నగదుతో సహా మొత్తం 1,50,000 నగదు బాధితులకు తిరిగి అందజేశారు. పొగొట్టుకున్న విలువైన వస్తువులు తిరిగి లభించడంతో బాధితురాలు గుర్రంపోడు పోలీసుల వేగవంతమైన స్పందన, సమర్థవంతమైన విధి నిర్వహణపై హర్షం వ్యక్తం చేస్తూ గుర్రంపోడు ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బంది నాగరాజు, సైదులు, నాగేందర్, నగేష్, శ్రీనుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

