ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ దిశగా ఆలోచిస్తున్న కూటమి ప్రభుత్వం… స్థానిక పోరుకు సెప్టెంబరు నెలను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పంచాయతీల నుంచి నగర పాలక సంస్థలు దాకా వరుసబెట్టి… అన్ని స్థాయిల స్థానిక సంస్థల ఎన్నికలను ఒకే సమయంలో ముగించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించినట్లు చూపుతోంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మరే ఎన్నిక జరగలేదనే చెప్పాలి. రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగినా… విపక్ష వైసీపీకి లేశమాత్రమే బలం ఉన్న నేపథ్యంలో ఏ సమయానికి ఎన్నికలు జరగలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే… ఆ పోరును సార్వత్రిక ఎన్నికల స్థాయి ఎన్నికలుగానే భావించక తప్పదు. అదికారంలోకి వచ్చిన తన కూటమి రెండేళ్ల పాలనకు గీటురాయిగా స్థానిక ఎన్నికలను పరిగణిస్తే… మూడేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలకు స్థానిక పోరే శాంపిల్ అన్న స్థాయిలో విపక్ష వైసీపీ సాగుతోంది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చ వస్తున్నా… ప్రతి సారి అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ దఫా మాత్రం స్థానిక పోరును వాయిదా వేయడానికి కూటమి ప్రభుత్వం ససేమిరా అంటున్నట్లు వినికిడి. అలాగే గ్రామ పంచాయతీల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆపై మునిసిపల్ ఎన్నికలను వరుసబెట్టి ఒకే విడతలో లాగించే దిశగా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. వర్గాల సమాచారం ప్రకారం ముందుగా మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మునిసిపల్ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు… ఆ తర్వాత చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం కోరినట్లు సమాచారం.
టీడీపీ, బీజేపీ, జనసేనలకు పట్టణ ప్రాంతాల్లో విస్పష్టమైన పట్టు ఉంది. పల్లె సీమల్లోనూ ఈ పార్టీలకు మెజారిటీ ఉన్నా… విపక్ష వైసీపీకి గ్రామాల్లో కూడా మంచి పట్టున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల్లో సత్తా చాటే దిశగా కూటమిలోని అన్ని పార్టీల కేడర్ ను ఆయా పార్టీలు అప్రమత్తం చేస్తున్నాయి. ప్రభుత్వం పనితీరుకు గీటురాయిగా పరిగణిస్తున్న ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కూటమి సర్కారు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 27 నుంచి 45 రోజుల పాటు ప్రజా ప్రతినిధులు తమ ప్రతి గడపను టచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా సమాయత్తం కావాలని తమ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. విపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఎన్నికల్లో సత్తా చాటే దిశగా కృషి చేయడం శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.

