రామాయణం: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. ఇది కేవలం భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయుల విశ్వాసంతో ముడిపడిన మహా ఇతిహాసం కూడా. అందుకే తాజాగా నిన్న నిర్వహించిన ‘ప్రథమ్ సంకల్ప్’ కార్యక్రమం ఒక ట్రైలర్ ప్రివ్యూ ఈవెంట్‌గా కాకుండా, భక్తి, కృతజ్ఞతతో కలిసి ప్రత్యేక వేడుకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సాయి పల్లవి, రణబీర్ కపూర్, యష్ తమ అనుభవాలను పంచుకున్న తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ వేడుకలో హృదయాలను హత్తుకున్న క్షణాల్లో ఒకటి సీతామాత పాత్రపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు. ఈ పాత్రను తాను సాధించలేదని, ఆ పాత్ర తనను ఎంచుకుందని ఆమె భావోద్వేగంగా చెప్పారు. సీత పాత్రను కేవలం నటనగా కాకుండా ఒక దైవిక బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. షూటింగ్ సమయంలో ప్రతి సన్నివేశం సహజంగా రావాలని, ప్రతి హావభావంలో సీతమ్మ తత్వాన్ని ప్రతిబింబించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించేదానిని. తన ఆలోచనలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేలా ప్రయత్నించానని, ఈ ప్రయాణం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా తన జీవితాన్నే మార్చేసిందని సాయి పల్లవి అన్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన పాత్రల్లో ఒకరిని పోషించే అవకాశం తనకు దక్కడం జీవితాంతం గుర్తుండిపోయే వరమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత వేదికపై మాట్లాడిన రణబీర్ కపూర్ తన వినయంతో అందరినీ ఆకట్టుకున్నారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, కంటి ఇన్ఫెక్షన్ కారణంగా సన్ గ్లాసెస్ ధరించాల్సి వచ్చిందని ముందుగా క్షమాపణ చెప్పారు. అనంతరం తన దృష్టిని సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ వైపు మళ్లించారు. టెలివిజన్‌లో శ్రీరామ పాత్రతో కోట్లాది భారతీయుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన అరుణ్ గోవిల్‌ను ఉద్దేశించి, ఆయన సృష్టించిన ఆ దైవిక రూపానికి కనీసం ఒక శాతం న్యాయం చేయగలిగిన తన నాట జీవితంలో అది గొప్ప విజయంగా భావిస్తున్నానని అన్నారు. శ్రీరాముడి పాత్రను పోషించడం ఎంతటి బాధ్యతో తనకు పూర్తిగా తెలుసు, ఆ పాత్ర పట్ల అపారమైన గౌరవంతో పనిచేశానని చెప్పారు.
రావణుడి పాత్రలో నటించిన యష్ కూడా ఈ కార్యక్రమంలో ఈ సినిమా విశిష్టతను వివరించారు. రామాయణం కేవలం ఒక సినిమా కాదని, భారతదేశపు సంస్కృతి, ఆధ్యాత్మికత, విలువ ప్రపంచానికి పరిచయం చేసే మహత్తర ప్రయత్నమని చెప్పారు. ఈ స్థాయి ప్రాజెక్ట్‌ను ఆలోచించి అమలు చేయాలనే ధైర్యం నిర్మాత నమిత్ మల్హోత్రాకే సాధ్యమైందని ప్రశంసించారు. దర్శకుడు నితేష్ తివారీ తన పాత్రలోని ప్రతి కోణాన్ని అర్థం చేసుకునేలా ఎంతో సహాయం అందించారు. అలాగే శ్రీరాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ చూపించిన అంకితభావాన్ని, సీతగా సాయి పల్లవి కనబరిచిన నిజాయితీని ప్రత్యేకంగా కొనియాడారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్పం’ పేరుతో నిర్వహించిన ఈ ట్రైలర్ లాంచ్ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. జూలై 24న గ్లోబల్ వైడ్‌గా విడుదల కానున్న ట్రైలర్ మరింత కనుల పండుగలా జరగబోతోంది.

