లెనిన్ మరో సక్సెస్ మీట్ ఇవాళ జరిగింది. అఖిల్, నాగార్జున రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఈసారి నాగచైతన్య తోడవ్వడంతో మరింత అట్రాక్షన్ జత కలిసింది. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ ఒడిస్సి లాంటి పెద్ద సినిమా ఏడాది ముందే రిలీజ్ డేట్ ఇచ్చి దానికి కట్టుబడ్డారని, కానీ తనతో టాలీవుడ్ లో అధిక శాతం నిర్మాణ సంస్థల మాట మీద నిలబడలేక వాయిదాలు వేస్తున్నారని,. కనీసం రెండు వారాల ముందు ఫైనల్ కాపీ ఇస్తే బాగుంటుందనే తరహాలో సలహాలు సూచనలు ఇచ్చారు.
మాములుగా వివరించినట్లు అనిపించినా నాగార్జున చెప్పింది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే చాలా ఏళ్లుగా ప్యాన్ ఇండియా మూవీస్ విపరీతమైన జాప్యానికి ఉన్నాయి. కనీసం నాలుగైదు రిలీజ్ డేట్లు మారకుండా ఏది బయటికి రావడం లేదు. అనిల్ రావిపూడి లాంటి ఒకరిద్దరు మినహాయించి ఎవరూ టార్గెట్ రీచ్ కాలేకపోతున్నారు. దీనికి అందరూ బాధ్యులే. వేల కోట్లతో తీసిన ఒడిస్సి అంత గ్యారెంటీగా విడుదల తేదీని అందుకున్నప్పుడు మనం ఎందుకు చేయలేం.
నిజంగా నిర్మాతలు కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకోవడం అవసరం అనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయడానికి ఒక్కటే కారణం. బడ్జెట్ కంట్రోల్ లో ఉండటం, ఇచ్చిన ప్లానింగ్ కు తగ్గట్టు దర్శకులు ఎలాంటి ఆలస్యం చేయకుండా ప్రోడక్ట్ సిద్ధం చేయడం. కానీ ఇప్పుడలాంటి పరిస్థితులు లేవు. అంతా స్వయంకృతాపరాధంగా మారిపోయింది. కనీసం రెండు సంవత్సరాలు తీయకపోతే అదో అవమానంగా ఫీలవుతున్న డైరెక్టర్లు లేకపోలేదు.
మరో మూడు ముఖ్యమైన విషయం ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ కాకుండా ఒడిస్సికి షూటింగ్ డేస్ తొంభై రోజులు. ఇక్కడ మూడు నెలల్లో ఒక షెడ్యూల్ తీస్తే గగనం అనుకోవాలి. ఇలాంటి వాటిలో మార్పు రావాలి. లేదంటే నిర్మాతల జేబులకు చిల్లులు పడుతూనే ఉంటాయి. మూడు పాత్రలు పోషించి నిర్మాణం ప్లస్ దర్శకత్వం వహించిన దానవీరశూరకర్ణని ఎన్టీఆర్ అతి తక్కువ రోజుల్లో తీసిన రికార్డు ఇప్పటికీ భద్రంగా ఉంది. మరీ అంత వేగంగా కాని కనీస స్థాయిలో స్పీడ్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది.

