ఒక ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఒక హీరో.. ఇంకా ఎంతో వయసు, కెరీర్ ఉండగానే సినిమాలు వదిలేసి వెళ్లిపోవడం అరుదు. తమిళ కథానాయకుడు విజయ్ ఈ పనే చేశాడు. రెండేళ్ల కిందట టీవీకే పేరుతో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకిపెట్టిన విజయ్.. చివరగా ‘జననాయకన్’ అనే సినిమా చేశాడు. ఇది తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడి ఎట్టకేలకు గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చివరగా ఒకసారి తమ అభిమాన కథానాయకుడి థియేటర్లలో సెలబ్రేట్ చేయడానికి విజయ్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా కదిలారు. ఈ రోజు ఉదయం నుంచి తమిళనాట సంబరాలు మామూలుగా లేవు. విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండటంతో విజయ్ అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది.
ముందు అనుకున్నట్లుగా సంక్రాంతికి ‘జననాయకన్’ రిలీజై ఉంటే.. ఆయన పేరు ముందు ఎప్పట్లాగే ‘దళపతి’ అని మాత్రమే ఉండేది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సినిమా రిలీజ్ కావడంతో టైటిల్ కార్డ్ మారిపోయింది. గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి అని జోడించడంతో పాటు ‘సి.జోసెఫ్ విజయ్’ అని ఆయన పూర్తి పేరును వేశారు. అంతే కాక తమిళనాడు అసెంబ్లీని షేక్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక మూమెంట్ కూడా సినిమాలో పెట్టేశారు.
ముఖ్యమంత్రిగా విజయ్ సూటేసుకుని స్టైల్‌గా అసెంబ్లీలో చేసిన ఒక మేనరిజంను సినిమా కోసం టైటిల్ కార్డులో వేసింది ‘జననాయకన్’ టీం. ఇది విజయ్ అభిమానులు కూడా ఊహించని సర్ప్రైజ్. దీనితో థియేటర్లలో ఫ్యాన్స్ కోలాహలం మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ తెగ వైరల్ అవుతోంది. ‘వన్ లాస్ట్ టైం’ అంటూ విజయ్‌కి ట్రిబ్యూట్‌గా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి సోషల్ మీడియాను ఉదయం నుంచి అభిమానులు షేక్ చేస్తున్నారు. ఐతే ‘జననాయకన్’లో ఫ్యాన్ మూమెంట్స్‌కు లోటు లేకపోయినా.. ఈ సినిమాకు అంత పాజిటివ్ టాక్ అయితే లేదు.

