నాలుగు వేల కోట్లతో తీశామని గొప్పగా చెప్పుకున్న ప్యాన్ ఇండియా మూవీ రామాయణ ప్రమోషన్ల పరంగా వేస్తున్న అడుగులు ఏటేటా వెళ్తున్నాయి. ఈ రోజు ట్రైలర్ విడుదల కావాలి. దాని కోసం కోట్లాది మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత భారీ బడ్జెట్ తో తీసిన విజువల్ వండర్ తాలూకు శాంపిల్ ఎలా ఉంటుందోననే ఎగ్జైట్ మెంట్ తో 24 తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందోనని ఎదురు చూశారు. తీరా చూస్తే హఠాత్తుగా పోస్ట్ పోన్ అంటూ చావు కబురు చల్లగా చెప్పారు.
డిస్ట్రిబ్యూషన్ హక్కులు సోని సంస్థకు ఇవ్వడం వల్ల మార్కెటింగ్ ప్రణాళిక మారిందని, ఢిల్లీలో జరుగుతున్న నిరసనల వల్ల వాతావరణం సానుకూలంగా లేదని టీమ్ కారణాలు అయితే ట్రైలర్ లాంచ్ కి లింక్ ఏమిటో అర్థం కాక సినీ ప్రియులు తల గోక్కుంటున్నారు. ఆల్రెడీ వారం క్రితమే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఈవెంట్ చేసి మరీ నాలుగు నిమిషాల ట్రైలర్ చూపించారు కొందరు రహస్యంగా రికార్డు చేసిన క్లిప్స్ సోషల్ మీడియాలో తిరిగి వైరలయ్యాయి.
అలాంటప్పుడు త్వరగా ట్రయిలర్ లాంఛనం జరిగిపోవాలి. కానీ టీమ్ ఉద్దేశాలు ఏమిటో అర్థం కావడం లేదు. మళ్ళీ ఏమైనా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందని భావించి రిపేర్లు చేస్తున్నారా లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నితేశ్ తివారి దర్శకత్వం వహించిన రామాయణం మొదటి భాగం నవంబర్ 8 విడుదల దాదాపు ఫిక్స్ అయ్యింది. ఈ తేదీని ట్రైలర్ తో పాటు రివీల్ చేయాలనేది మేకర్స్ ముందుగా వేసుకున్న ప్రణాళిక.
సరే ఎప్పుడు వదులుతారో వాళ్ళ ఇష్టం కానీ త్వరగా జనం ముందుకు వస్తే బాగుంటుంది. బజ్ పరంగా ఉపయోగం కలుగుతుంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటించిన ఈ ఎపిక్ డ్రామాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదల వాయిదా ప్రసక్తే లేదని ముంబై టాక్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతో పాటు థియేటర్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

