- ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ఆగ్రహం
- కోమటిరెడ్డి సోదరులపై తీవ్ర ఆరోపణలు
- సీఎం, పీసీసీ చీఫ్‌కు సామేల్
- ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదురు?
మందుల శామ్యూల్ : సూర్యాపేట జిల్లా రాజకీయంలో తీవ్ర సంచలనం. తుంగతుర్తి కాంగ్రెస్ శాసనసభ్యుడు మందుల సామెల్ సొంత పార్టీకి చెందిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో కోమటిరెడ్డి సోదరుల వైఖరిని తప్పుబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం.. సీఎంతో పాటు పీసీసీ సమాధానం చెప్పాలి
తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా ఉండటంపై ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “తుంగతుర్తికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడనే విషయం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియడం లేదు. స్థానిక శాసనసభ్యుడినైన నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారు? కనీస ప్రోటోకాల్ పాటించరా?” అని ప్రశ్నించారు. కోమటిరెడ్డికి ఎస్సీ నియోజకవర్గం చిన్నచూపని, మాదిగలపై వివక్ష చూపిస్తున్నారని తెలిపారు. మాదిగలు ఎవరికీ బానిసలు కాదని స్పష్టం చేసిన ఆయన, ఇదే తరహా పద్ధతిలో కొనసాగితే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మా జోలికొస్తే రాజకీయ సమాధి కడతాం
తమ గౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, అంతకు అంత ప్రతికారం తీర్చుకుంటామని సామెల్ హెచ్చరించారు. “మా జోలికొస్తే మీ రాజకీయ సమాధికి మేమే డప్పులు కొడతాం, మా దండోరా మోగుతుంది. అహంకార పూరితమైన రాజకీయాన్ని చావుదెబ్బ తీస్తాం” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా ఎవరి రాజ్యమూ కాదని, ఇది శ్రమజీవుల జిల్లా అని స్పష్టం చేస్తూ, తనతో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజల అభిమానంతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టామని ధీమా వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి సోదరుల వైఖరిపై తీవ్ర విమర్శలు
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై కూడా మందుల సామెల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి ఎందుకు వెళ్లారో రాజగోపాల్ రెడ్డి ముందుగా సమాధానం చెప్పాలని నిలదీశారు. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి వచ్చి తీరుపై పూర్తి రిపోర్టు ఉందని. నాయకులు తమ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తే మంచిదని, ఎస్సీ స్థానాలైన తమ సీట్లపై ఇతరుల పెత్తనం ఏంటని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.

